Kadiyam Srihari: అలా అయితే కడియం శ్రీహరి, కావ్య బీజేపీలోకి వెళ్లడం ఖాయం: తాటికొండ రాజయ్య

Kadiyam Srihari Likely to Join BJP Claims Tatikonda Rajaiah
  • కడియం శ్రీహరి, కావ్య బీజేపీలో చేరడం ఖాయమన్న రాజయ్య
  • కేంద్రమంత్రి పదవి కోసమే ఈ అడుగులని ఆరోపణ
  • కాంగ్రెస్‌ను శ్రీహరి మోసం చేస్తారన్న మాజీ ఎమ్మెల్యే
  • గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌లకు ద్రోహం చేశారని విమర్శ
  • అభివృద్ధిపై శ్రీహరివి కల్లబొల్లి మాటలని రాజయ్య వ్యాఖ్య
కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరడం ఖాయమని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ఆశతోనే శ్రీహరి ఈ నిర్ణయం తీసుకుంటారని ఆయన జోస్యం చెప్పారు. లింగాల గణపురంలో సోమవారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, "పదవి వస్తుందంటే చాలు, వెన్నుపోటు పొడిచే అలవాటు కడియం శ్రీహరికి ఉంది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన, తన కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌ను మోసం చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం" అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టడం లేదని, కేంద్రం తనను చెప్పులు ఎత్తుకెళ్లే దొంగలా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కడియం శ్రీహరి మాత్రం నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

"రాజకీయంగా భవిష్యత్తునిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పంచన చేరారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన వారిలో కడియం కూడా ఒకరు" అని ఆరోపించారు. ఆ తర్వాత, మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబుకు కూడా ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఆయనకు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశాలు కల్పించారని, ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని రాజయ్య గుర్తుచేశారు. "అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి రూ. 200 కోట్లకు అమ్ముడుపోయి కేసీఆర్‌కు కడియం ద్రోహం చేశారు" అని రాజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మార్చడం, నమ్మినవారిని మోసం చేయడం కడియం శ్రీహరికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన దుయ్యబట్టారు.
Kadiyam Srihari
Kadiyam Kavya
Tatkonda Rajaiah
BJP
Congress Party
Telangana Politics

More Telugu News