Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన మహిళ.. మరోసారి భద్రతా వైఫల్యం!

Salman Khans security once again breached woman enters actors building
  • సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన మహిళ
  • లిఫ్ట్ వద్ద అడ్డుకున్న భద్రతా సిబ్బంది
  • బాంద్రా పోలీసులకు అప్పగింత, కేసు నమోదు
  • లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల నేపథ్యంలో ఘటన
  • గతంలో సల్మాన్ ఇంటిపై కాల్పులు కలకలం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో మరోసారి ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్మాన్ నివాసంలోకి ఓ మహిళ చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.

రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి ఓ కారు చాటున నక్కి సల్మాన్ నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఆయన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఇషా ఛబ్రా (32) అనే మహిళ  గురువారం సల్మాన్ నివాసం ఉండే భవనంలోని లిఫ్ట్ ఏరియా వరకు వెళ్లింది. ఆమె నటుడి నివాసంలోకి ప్రవేశించే లోపే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, బాంద్రా పోలీసులకు సమాచారం అందించి, ఆమెను వారికి అప్పగించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. గత ఏడాది కూడా సల్మాన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటన వెనుక కూడా లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు.

ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేశారు. భద్రత కారణంగా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా, తనకు ఎలాంటి భయం లేదని, అంతా దేవుడే చూసుకుంటాడని సల్మాన్ గతంలో మీడియాకు తెలిపారు. 


Salman Khan
Salman Khan security
Lawrence Bishnoi
Galaxy Apartments
Isha Chhabra
Mumbai police
Bollywood actor
security breach
gangster threat
bulletproof glass

More Telugu News