Jyoti Malhotra: పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన

Jyoti Malhotra Pakistan Spy Case Haryana Police Key Statement
  • జ్యోతి మల్హోత్రాకు ఉగ్ర లింకులు లేవని తేల్చేసిన పోలీసులు 
  •  పాక్ ఇంటెలిజెన్స్‌తో తెలిసి సంప్రదింపులు జరిపిన జ్యోతి
  •  పెళ్లి, మతమార్పిడికి సంబంధించి సాక్ష్యాలు లభించలేదన్న పోలీసులు
  •  సాయుధ బలగాల వ్యూహాలపై జ్యోతికి అవగాహన లేదని నిర్ధారణ
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలతో అరెస్టయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించలేదని హరియాణా పోలీసులు తాజాగా వెల్లడించారు. జ్యోతి మల్హోత్రా పూర్తి స్పృహతోనే పాకిస్థానీ నిఘా వర్గాల అధికారులతో సంప్రదింపులు జరిపారని పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి హిస్సార్ ఎస్పీ మరిన్ని వివరాలు వెల్లడించారు. "జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాద సంస్థలతో గానీ, ఉగ్రవాదులతో గానీ సంబంధాలున్నట్లు ఇప్పటివరకూ మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆమె ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవు" అని ఆయన వివరించారు. పాకిస్థాన్ నిఘా వర్గాల అధికారులను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన గానీ, మతం మార్చుకోవాలనే ఉద్దేశం గానీ జ్యోతికి ఉన్నట్లు ధ్రువీకరించే పత్రాలు ఏవీ తమకు లభించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

అయితే, తాను సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తులు పాకిస్థాన్ గూఢచార సంస్థకు చెందినవారని తెలిసినప్పటికీ జ్యోతి మల్హోత్రా వారితో టచ్‌లో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. భారత సాయుధ బలగాల వ్యూహాలు, ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా అవగాహన ఉన్నట్లు దర్యాప్తులో కనిపించడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Jyoti Malhotra
YouTuber Jyoti Malhotra
Pakistan Spy Case
Haryana Police
Hisar SP
ISI
espionage
India armed forces
Pakistan intelligence

More Telugu News