Nambala Kesava Rao: ఎంటెక్ నుంచి ఉద్యమంలోకి... నంబాల కేశవరావు ప్రస్థానం

Nambala Kesava Rao From M Tech to Maoist Movement
  • మావోయిస్టు అగ్రనేత బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి
  • 2018లో గణపతి తర్వాత పార్టీ సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు
  • శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట స్వగ్రామం
  • వరంగల్ ఆర్ఈసీలో ఎం.టెక్, అక్కడే విప్లవ భావజాలం వైపు ఆకర్షణ
  • 1983లో అజ్ఞాతంలోకి, అప్పటినుంచి గ్రామంతో సంబంధాలు కట్
మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలకమైన అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ధ్రువీకరించారు. మావోయిస్టు ఉద్యమానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా మాధ్‌ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరణించిన వారిలో నంబాల కేశవరావు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల లొంగిపోయిన కొందరు మావోలు నంబాల కేశవరావును గుర్తించినట్టు  సమాచారం. ఆయన తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.

నంబాల కేశవరావు నేపథ్యం
నంబాల కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం జియన్నపేట గ్రామం. ఆయన 1955లో జన్మించినట్లు సమాచారం. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కేశవరావుకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ప్రాథమిక విద్యను తన సొంత ఊరిలోనే పూర్తి చేసిన కేశవరావు, ఉన్నత పాఠశాల విద్యను టెక్కలి మండలం తలగాంలోని తన తాతగారి గ్రామంలో అభ్యసించారు. అనంతరం టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ, డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న తరుణంలో వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాల (ప్రస్తుత నిట్)లో ఆయనకు ప్రవేశం లభించింది.

బీటెక్ పూర్తిచేసిన తర్వాత కేశవరావు ఎం.టెక్ కూడా పూర్తిచేశారు. ఉన్నత విద్యావంతుడైన ఆయన, 1983లో పూర్తిస్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి నక్సల్‌బరి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి ఆయన తిరిగి స్వగ్రామానికి రాలేదని గ్రామస్థులు చెబుతుంటారు. సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆయన, గణపతి తర్వాత పార్టీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన మరణంతో పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది.

మావోయిస్టు ఉద్యమంలోకి ప్రవేశం, కీలక పాత్ర
ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే పీపుల్స్ వార్ గ్రూపు సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) మరియు ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేశవరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత ఆయన తన పేరును బసవరాజుగా మార్చుకున్నారు.

1987లో బస్తర్ అడవుల్లో ఎల్‌టీటీఈ మాజీ సైనికుల వద్ద గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఆయుధ వినియోగంలో ప్రత్యేక శిక్షణ పొందారు. ముఖ్యంగా ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో ఆయనది అందెవేసిన చేయి అని చెబుతారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న కేశవరావు, కాలక్రమేణా మావోయిస్టు పార్టీలో కీలక స్థాయికి ఎదిగారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా కూడా ఆయన పనిచేశారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2018లో అప్పటి మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) రాజీనామా చేయడంతో, ఆ బాధ్యతలను బసవరాజు స్వీకరించారు.

ప్రధాన దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలు
దేశవ్యాప్తంగా జరిగిన అనేక విధ్వంసక ఘటనలకు బసవరాజు సూత్రధారి అని భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా, 2010లో ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన భೀకర దాడి, అలాగే 2019లో మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతికి కారణమైన పేలుళ్ల ఘటన వెనుక బసవరాజు కీలక పాత్ర పోషించారని అధికారులు పేర్కొంటున్నారు. ఆయన మృతితో మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Nambala Kesava Rao
Basavaraju
Maoist
Chhattisgarh
encounter
Naxalite
Srikakulam
Peoples War Group
Central Military Commission
IED

More Telugu News