YS Sharmila: కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు: షర్మిల

YS Sharmila Condemns Visakha Steel Plant Privatization by Central Government
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ షర్మిల
  • కార్మికులను తొలగిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక
  • కేంద్రం కుట్రపూరితంగా ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతోందని ఆరోపణ
  • రూ.11 వేల కోట్ల సాయం పేరుతో మోసం జరిగిందని విమర్శ
  • రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తి
  • అదానీ కోసమే స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కార్మికులను తొలగిస్తూ, ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. 'ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు' నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని, ఆ సమయంలో లాభాల బాటలో నడిచిందని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే "కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది చేయాలి" అన్న చందంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను తొలగించడం, ప్లాంట్‌కు అవసరమైన ముడి సరుకు అందకుండా చేయడం, సొంత గనులు కేటాయించకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. 

కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ఉద్ధరించేందుకు రూ.11 వేల కోట్లు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, ఇచ్చినట్లే ఇచ్చి అందులోంచి రూ.8 వేల కోట్లను బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు. మిగిలిన రూ.3 వేల కోట్లు ఇవ్వాలంటే ఏకంగా 5 వేల మంది ఉద్యోగులను తొలగించాలని షరతు పెట్టారని, ఇది ప్లాంట్‌ను అదానీ వంటి వారికి కట్టబెట్టే కుట్రలో భాగమేనని షర్మిల ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. "ప్రధాని మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? మోదీతో లాలూచీ పడ్డారా? లేక ఈ కుట్రలో మీరూ భాగస్వాములా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
YS Sharmila
Visakha Steel Plant
Andhra Pradesh
Congress Party
Privatization
Steel Plant Workers
Chandrababu Naidu
Pawan Kalyan
BJP Government
Adani

More Telugu News