Pawan Kalyan: వాళ్ల కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan urges police to be more vigilant than soldiers
  • సరిహద్దుల్లో సైనికుల కంటే ఎక్కువగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్
  • ఉగ్రవాదులకు దక్షిణాది రాష్ట్రాలు సున్నిత లక్ష్యాలని వ్యాఖ్య
  • డీజీపీకి లేఖ రాసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరానని వెల్లడి
  • తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశం
దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతటి అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తారో, రాష్ట్రంలో అంతర్గత భద్రత విషయంలో పోలీసులు కూడా అంతే జాగరూకతతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదులకు సున్నితమైన లక్ష్యంగా మారాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, పరిపాలన సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో కోయంబత్తూరు, హైదరాబాద్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ, ఆ సంఘటనలు తలచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో ఉగ్రవాదుల జాడలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గారిని లేఖ ద్వారా కోరాను. పాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఉగ్రవాద జాడలున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించాను" అని పవన్ వివరించారు.

ముఖ్యంగా వలస వచ్చే వారి విషయంలో సరైన నిఘా ఉంచడం ద్వారా సంభవించబోయే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, తీర ప్రాంతంలో కూడా నిరంతర పర్యవేక్షణ, నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. "గతంలో కాకినాడలో బయట వ్యక్తులు బోట్లలో వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, వారి కార్యకలాపాలను నిశితంగా గమనించాలి. పోలీసులు అజాగ్రత్తగా ఉండకుండా అంతర్గత భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆయన హితవు పలికారు.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రాష్ట్రంలో కొన్ని ఉగ్రవాద జాడలు కనిపించినట్లు తెలిసిందని, ఈ పరిణామాల దృష్ట్యా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. అంతర్గత భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan
Andhra Pradesh
internal security
police alert
terrorism
coastal security
Telangana police
anti-terrorism operations
Vijayawada airport
crime prevention

More Telugu News