AV Rangnath: అలా చేస్తే కఠిన చర్యలు: రియల్టర్లు, బిల్డర్లకు హైడ్రా కమిషనర్ హెచ్చరిక

HYDRA Commissioner Warns Real Estate Builders
  • చెరువులో మ‌ట్టి పోస్తే క‌ఠిన చర్యలు ఉంటాయని వెల్లడి
  • శిఖం భూమిలో అయినా స‌డ‌లింపు లేదని స్పష్టీకరణ
  • ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ కేటాయింపు
చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తప్పవని 'హైడ్రా' స్పష్టం చేసింది. చెరువుల పరిరక్షణ విషయంలో ఉపేక్షించేది లేదని, నిరంతర నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, రవాణాదారులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులతో హైడ్రా అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతకు చెరువుల పరిరక్షణ అత్యంత కీలకమని, ఈ దిశగా హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పారబోయాలో బిల్డర్లు, రవాణాదారులు ముందే ఒక అవగాహనకు రావాలని ఆయన సూచించారు.

"మట్టి తరలింపు కాంట్రాక్టర్‌కు అప్పగించాం, ఆయన ఎక్కడ వేస్తే మాకేంటి?" అనే ధోరణిలో బిల్డర్లు వ్యవహరిస్తే, బాధ్యులందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రవాణా ఖర్చులు ఆదా చేసుకోవడానికి దగ్గరలోని చెరువుల ఒడ్డున వ్యర్థాలు వేస్తే, ఆ వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, డ్రైవర్, వాహన యజమానితో పాటు వ్యర్థాలను తరలిస్తున్న నిర్మాణ సంస్థ యజమానిపైనా క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. శిఖం భూముల్లో కూడా ఎలాంటి మట్టినీ నింపరాదని ఆదేశించారు.

ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇక్కడ కేసులు నమోదు చేస్తారని తెలిపారు. చెరువుల వద్ద 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. చెరువుల్లో అక్రమంగా మట్టి, వ్యర్థాలు వేస్తున్న వారి సమాచారాన్ని అందించాలని నగర ప్రజలను హైడ్రా కోరింది. ఇందుకోసం 9000113667 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేకాకుండా, హైడ్రా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
AV Rangnath
HYDRA
Hyderabad
Real Estate
Builders
Construction Waste

More Telugu News