Donald Trump: భారత్ సుంకాలపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

Trumps Latest Remarks on Indias Tariffs
  • అమెరికా వస్తువులకు భారత్ జీరో టారిఫ్ ఆఫర్ చేసిందని ట్రంప్ పునరుద్ఘాటన
  • చాలా వస్తువులపై సుంకాలు 100% తగ్గించడానికి భారత్ ఒప్పుకుందన్న ట్రంప్
  • ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని విమర్శ
  • భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తొందరేమీ లేదని ట్రంప్ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య సుంకాలను మరోసారి ప్రస్తావించారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్‌ను ప్రతిపాదించిందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్‌పై పలు ఆరోపణలు చేశారు. ప్రపంచంలోనే అత్యధికం సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 100 శాతం వరకు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు.

భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో తమకు తొందర లేదని, తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

గతంలో ట్రంప్ చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించిన విషయం విదితమే. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి చాలా సంక్లిష్టమైన చర్చలని ఆయన అన్నారు. ప్రతి అంశంపైనా తుది నిర్ణయం తీసుకునే వరకు ఇవి కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని, అది ఖరారు అయ్యే వరకు దాని గురించి ప్రకటించడం తొందరపాటు అవుతుందని జైశంకర్ పేర్కొన్నారు.
Donald Trump
India-US Trade
Tariffs
Trade Deal
Zero Tariff
India
US
S. Jaishankar
Trade War
Import Duties

More Telugu News