Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు: చంద్రబాబు

Historic Kadapa Mahanadu Chandrababu Naidus Vision
  • మొదటిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడుతో రాయలసీమలో నూతనోత్సాహం: చంద్రబాబు
  • సీమకు సాగు నీళ్లిచ్చింది....ఫ్యాక్షన్ ను అంతం చేసింది మనమే: చంద్రబాబు
  • పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను మారుతుంది: చంద్రబాబు
కడపలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండిపోయేలా నిలిచిపోతుందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరుగుతున్న మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు అని అన్నారు. గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించినా....కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామన్నారు. అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని 2024లో అధికారంలోకి వచ్చామని... ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని సిఎం చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్ర చర్చ జరగాలన్నారు.

రాయలసీమ రూపురేఖలు మార్చిందే తెలుగుదేశం

రాయలసీమ ప్రజల గుండెల్లో పార్టీ బలంగా ఉందని...దీనికి కారణం తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులేనన్నారు. రాయలసీమను పీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, ఫ్యాక్షన్‌పై అత్యంత కఠినంగా వ్యవహరించాం కాబట్టే నేడు సీమ నుంచి ఫ్యాక్షన్‌ను పూర్తిగా తరిమేశామన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చర్యలు ప్రజల గుండెల్లో ఉన్నాయని గుర్తు చేశారు. సీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని మొదట ఎన్టీఆర్ సంకల్పం చేశారన్నారు. హంద్రీనీవా, గాలేరు - నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే అని చంద్రబాబు గుర్తు చేశారు. ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తాగు, సాగు నీరిచ్చిన ఘనత టీడీపీదని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సీమలో కరువుకు సమాధానం చెప్పామని, నేడు డ్రిప్ లేని ప్రాంతాన్ని రాయల సీమలో మనం చూడగలమా అని అన్నారు. 2014 తరువాత టీడీపీ పాలనలో రూ.12 వేల కోట్లకుపైగా నిధులను రాయలసీమలోనే సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి గొప్ప ఫలితాలు సాధించామని అన్నారు. ఒకవైపు కరువు సీమను సస్యశ్యామలం చేస్తూ మరోవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్, కర్నూలులో ఓర్వకల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్ పవర్, సోలార్ ద్వారా సీమలో ప్రగతిని వేగవంతం చేశామన్నారు. తిరుమల, తిరుపతి అభివృద్ధి జరిగిందంటే టీడీపీ హయాంలోనే అన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. కడప, కర్నూలు ఎయిర్ పోర్టు నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తుచేశారు.

మహానాడుతో నూతన ఉత్సాహం

టీడీపీ క్యాడర్ మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారని, ఈ సభ ద్వారా రాయలసీమలో నూతన ఉత్సాహం వస్తుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో హార్టికల్చర్, పరిశ్రమలు, డెయిరీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హార్టికల్చర్ ద్వారా వచ్చే మార్పులతో రాయల సీమ ప్రజలు కోనసీమ రైతులను అధిగమిస్తారని...ఈ ఫలితాలు రానున్న 4 ఏళ్లలో చూస్తామని అన్నారు. పార్టీ నేతలు ఈ అంశాలు అన్నీ ప్రజల్లో చర్చించాలని అన్నారు.

పార్టీ సిద్ధాంతాలు...ప్రభుత్వ విజయాలపై చర్చ

మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించాలని సిఎం సూచించారు. మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలన్నారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఎక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని చంద్రబాబు తెలిపారు. మినీ మహానాడును ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో, 22, 23 తేదీల్లో పార్లమెంట్ల వారీగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 
Chandrababu Naidu
TDP Mahanadu
Kadapa Mahanadu
Andhra Pradesh Politics
Rayalaseema Development
Telugu Desam Party
Nara Chandrababu Naidu
Kadapa
Rayalaseema
Telugu Politics

More Telugu News