China: జీతంతో పాటు ఫ్రీ టాయిలెట్, ఫ్రీ లిఫ్ట్.. చైనాలో వింత ఉద్యోగ ప్రకటన

Chinas Bizarre Job Ad Offers Free Toilet and Lift
  • చైనా కంపెనీ చిత్రమైన 'పెర్క్స్'పై నెటిజన్ల విస్మయం
  • ఇవి ప్రాథమిక హక్కులని, ప్రయోజనాలు కాదని విమర్శలు
  • ఆ దేశంలో ఉద్యోగ సంస్కృతికి అద్దం పడుతోందని నిపుణుల వ్యాఖ్యలు
చైనాలో ఓ కంపెనీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేస్తూ జీతంతో పాటు అదనపు ప్రయోజనాల కింద ఉచితంగా టాయిలెట్, లిఫ్ట్ లను వాడుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. తమ ఉద్యోగులకు ఈ రెండు ప్రయోజనాలు అదనంగా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వింత ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులకు కల్పించే మౌలిక, కనీస సదుపాయాలైన టాయిలెట్, లిఫ్ట్ లను అదనపు ప్రయోజనాలుగా పేర్కొవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ప్రకటన అక్కడి ఉద్యోగ సంస్కృతికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఏప్రిల్ 29న "వర్క్‌ప్లేస్ స్లాకర్స్" అనే సోషల్ మీడియా ఖాతా ఈ ప్రకటనను పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ప్రకటన ఇచ్చిన కంపెనీ వివరాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు. అయితే, ఇది ఆర్డర్ ప్రాసెసింగ్ ఉద్యోగమని, ఎక్సెల్ నైపుణ్యాలు, అనుభవం, వివరాలపై శ్రద్ధ పెట్టగల అభ్యర్థులు కావాలని ఆ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఈ ఉద్యోగంలో రోజుకు ఎనిమిది గంటల పనివేళలు ఉంటాయని, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు.

రెండింటిలోనూ గంట విరామం ఉంటుంది. ప్రొబేషనరీ కాలంలో నెల జీతం 4,000 యువాన్లు (సుమారు రూ.45,000). నెలకు నాలుగు రోజులు సెలవులు, జాతీయ సెలవు దినాల్లో రెట్టింపు జీతం ఇస్తామని పేర్కొన్నారు. అప్పుడప్పుడు టీమ్ బిల్డింగ్ కార్యక్రమాలు, మధ్యాహ్నం టీ, రాత్రిపూట స్నాక్స్ వంటివి కూడా ప్రయోజనాల జాబితాలో చేర్చింది. ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి నెలవారీ బేసిక్ జీతంపై 100 యువాన్లు పెంచుతామని కంపెనీ పేర్కొంది. కాగా, చైనాలో ఉద్యోగులకు ఎక్కువ పనిగంటలు, తక్కువ జీతాలు, సరైన పని పరిస్థితులు లేకపోవడం, ఉద్యోగ భద్రత కొరవడటం వంటి సమస్యలు సాధారణమని నిపుణులు అంటున్నారు. కొన్ని పరిశ్రమలలో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వారానికి ఆరు రోజులు పని అమలులో ఉందన్నారు.
China
Unusual Job Advertisement
Free Toilet
Free Lift
Employee Benefits
Social Media
Job Culture
Order Processing Job
Excel Skills
Workplace Slackers

More Telugu News