PSL 2025: ఐపీఎల్‌కు పోటీగా ఈ నెల 17న పీఎస్ఎల్ పునఃప్రారంభం

PSL Resumes on May 17th
  • భారత్‌, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ ప‌రిస్థితుల‌ కారణంగా వాయిదా పడ్డ పీఎస్ఎల్‌
  • లీగ్‌లో ఇంకా మిగిలి ఉన్న ఎనిమిది మ్యాచ్ లు 
  • రావల్పిండి క్రికెట్ స్టేడియంలో గ్రూప్ మ్యాచ్‌లు  
  • ప్లేఆఫ్‌లు, ఫైనల్ లాహోర్‌లో నిర్వ‌హిస్తామ‌న్న పీసీబీ
గత వారం భారత్‌, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ ప‌రిస్థితుల‌ కారణంగా వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2025 ఈ నెల 17 (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కానుంది. లీగ్‌లో ఇంకా ఎనిమిది మ్యాచ్ లు మిగిలి ఉండ‌గా... యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వ‌హించాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్ర‌య‌త్నించింది. కానీ, యూఏఈ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో లీగ్‌ను వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. 

ఇక‌, ఐపీఎల్ కూడా వారం రోజుల వాయిదా త‌ర్వాత ఈ నెల 17నే ప్రారంభం కానుంది. దాంతో ఐపీఎల్‌కు పోటీగా అదే రోజు పీఎస్ఎల్ కూడా రీస్టార్ట్ చేయాల‌ని పీసీబీ నిర్ణ‌యించింది. 

"పీఎస్ఎల్‌ 2025 మే 17న తిరిగి ప్రారంభమవుతుంది. ఫైనల్ మే 25న జరుగుతుంది. లీగ్ ఆగిపోయిన చోటు నుంచి పునఃప్రారంభం అవుతుంది. ఎలాంటి భయం లేకుండా ఆరు జట్లు బ‌రిలోకి దిగుతాయి" అని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌)లో తెలిపారు.

మిగిలిన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని, ప్లేఆఫ్‌లు, ఫైనల్ లాహోర్‌లో జరుగుతాయని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రావల్పిండి స్టేడియంను ఆనుకుని ఉన్న వీధిలో డ్రోన్ దాడి జరగడంతో మే 8న పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఏప్రిల్ 11 నుంచి కరాచీలో ప్రారంభమైన పీఎస్‌ఎల్‌ పదవ ఎడిషన్‌లో 37 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. 

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ కరాచీ కింగ్స్ కు సార‌థిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే స్వ‌దేశానికి వెళ్లిపోయిన అత‌డు తిరిగి లీగ్ కోసం పాకిస్థాన్‌కు రానున్న‌ట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించాడు. అయితే, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా ఈ లీగ్‌లో పాల్గొన్న ఎనిమిది మంది న్యూజిలాండ్ ఆటగాళ్లు భద్రతా ఏర్పాట్ల గురించి హామీ ఇచ్చినప్పటికీ తిరిగి రావడానికి ఇష్టపడలేదని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక‌, తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌పై అనిశ్చితి నెలకొంది. 
PSL 2025
Mohsin Khan
Pakistan Super League
IPL
David Warner
Kane Williamson
Pakistan Cricket Board
UAE
Cricket
Rawalpindi

More Telugu News