Peddi Reddy: పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ డీజీ నివేదిక

Pawan Kalyan Orders Criminal Cases Against Peddi Reddy for Land Encroachment
  • పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులకు పవన్ ఆదేశం
  •  ఆక్రమణలకు సహకరించిన అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న డిప్యూటీ సీఎం
  • ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం
చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆక్రమణల వ్యవహారంలో బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ పరిరక్షణ చట్టాల కింద కూడా కేసులు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
 
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా పరిధిలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ, బుగ్గ మఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ డిప్యూటీ సీఎం పవన్‌కు సమగ్ర నివేదికను సమర్పించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిలువరించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులను గుర్తించి, వారిని బాధ్యులను చేయాలని ఆ నివేదికలో డీజీ సిఫార్సు చేసినట్లు తెలిసింది.

విజిలెన్స్ డీజీ అందించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా అటవీ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారుల వివరాలను గుర్తించి, వారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, వారికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపైనా కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తదుపరి చర్యలు వేగవంతం చేయాలని అటవీ అధికారులకు పవన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
Peddi Reddy
Pawan Kalyan
Land Encroachment
Forest Land Grab
Chittoor District
Andhra Pradesh
Criminal Cases
Vigilance Department
Government Land
Illegal Occupation

More Telugu News