Mohammed Shami: రిటైర్మెంట్ రూమర్స్‌పై షమీ స్పందన ఇలా..

- తన రిటైర్మెంట్ వార్తలపై ఫైర్ అయిన షమీ
- వెబ్ సైట్ లో వార్త రాసిన జర్నలిస్ట్ పై ఆగ్రహం
- ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి అంటూ సూచన
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ సైతం పయనిస్తున్నాడని గత కొద్ది గంటలుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్, విరాట్ మాదిరిగానే షమీ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై షమీ ఘాటుగా స్పందించారు.
ఓ ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో తన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్కపెట్టుకో.. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీలాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు. ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు.
ఛాంపియన్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోతున్నారు. ఈ కారణంగా త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయరనే ప్రచారం జరిగింది. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో షమీ వ్యతిరేకులు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయవద్దంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో షమీ ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు.