Cannes Film Festival: ఇలాంటి బట్టలేసుకొస్తే కుదరదు.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కొత్త రూల్స్

Cannes Film Festival 2025 New Dress Code Rules Announced
  • నేటి నుంచి కేన్స్ ఫిలిం ఫెస్టివల్
  • రెడ్ కార్పెట్‌పై నగ్నత్వం, భారీ దుస్తులు నిషేధం
  • 2022 నాటి నిరసన, బియాంక సెన్సోరి వస్త్రధారణ ఈ నిర్ణయానికి కారణం
  • ఫ్రెంచ్ చట్టం, సంస్థాగత నియమావళికి అనుగుణంగా మార్పులు
ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ చిత్రోత్సవాలు నేడు (మే 13)న ఫ్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఏడాది రెడ్ కార్పెట్‌పై వస్త్రధారణ విషయంలో నిర్వాహకులు కొన్ని కీలకమైన, కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, రెడ్ కార్పెట్‌పై పూర్తి నగ్నత్వాన్ని ప్రదర్శించడం, అలాగే అతిగా, పెద్దవిగా ఉండి ఇతరులకు అసౌకర్యం కలిగించే దుస్తులను ధరించడాన్ని అధికారికంగా నిషేధించారు. ఈ నిర్ణయం ఫ్యాషన్ ప్రపంచంలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా కేన్స్ రెడ్ కార్పెట్‌పై చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఓ మహిళా నిరసనకారిణి అర్ధనగ్న ప్రదర్శన చేయడం, అలాగే ఈ ఏడాది జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో ప్రముఖ డిజైనర్, నటి బియాంక సెన్సోరి ధరించిన అతి తక్కువ దుస్తులు తీవ్ర వివాదాస్పదం కావడం వంటివి ఈ నూతన నిబంధనల రూపకల్పనకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

కేన్స్ ఫెస్టివల్ నిర్వాహకులు తమ సంస్థాగత నియమావళి, ఫ్రెంచ్ చట్టాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, నగ్నత్వంతో పాటు, ఇతరుల కదలికలకు ఆటంకం కలిగించే లేదా స్క్రీనింగ్ రూమ్‌లలో సీటింగ్ ఏర్పాట్లకు ఇబ్బంది కలిగించేంత భారీ దుస్తులు ధరించిన వారికి ప్రవేశం నిరాకరించే హక్కు ఫెస్టివల్ నిర్వాహకులకు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా, నేలపై అతి పొడవుగా విస్తరించి ఉండే గౌన్ల ట్రైల్స్ ఉన్న దుస్తులు ఈ నిషేధం పరిధిలోకి వస్తాయి. అలాగే, గాలా స్క్రీనింగ్‌ల సమయంలో పెద్ద టోట్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు వంటివి కూడా రెడ్ కార్పెట్‌పైకి అనుమతించబడవు.

భారతీయ తారల సందడి

నేడు ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు మే 24 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది కూడా పలువురు భారతీయ తారలు కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరిలో ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, షాలినీ పాసి, షర్మిలా ఠాగూర్, కరణ్ జోహార్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ నూతన వస్త్రధారణ నిబంధనల నేపథ్యంలో మన తారలు ఎలాంటి దుస్తుల్లో మెరుస్తారో చూడాలి.


Cannes Film Festival
Cannes 2024
Cannes Red Carpet Dress Code
Alia Bhatt
Aishwarya Rai Bachchan
New Cannes Rules
Film Festival Rules
Celebrity Fashion
Bianca Censori

More Telugu News