BrahMos Missile: పాక్ సైనిక స్థావరాల్లో బీభత్సం సృష్టించిన 'బ్రహ్మోస్'

BrahMos Missile Devastates Pak Military Bases
  • బ్రహ్మోస్ దాడులతో వణికిన పాక్
  • పాక్ కీలక స్థావరాలపై క్షణాల్లో దాడులు చేసిన భారత్
  • బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన వైనం
  • ప్రపంచంలోనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ 
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాకిస్థాన్‌ను చావుదెబ్బ తీసిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన దాడిలో పాకిస్థాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు పది వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా ఉపయోగించినట్లు సమాచారం.

భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, బ్రహ్మోస్ క్షిపణి వల్లనే పాక్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని భావిస్తున్నారు. జాతీయ మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. యుద్ధరంగంలో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఉపయోగించడం ఇదే మొదటిసారి కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడికి ముందు, పాకిస్థాన్ ఒక బాలిస్టిక్ క్షిపణిని హర్యానాలోని సిర్సాపైకి ప్రయోగించింది. దీంతో ఆగ్రహించిన భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అణు యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళనతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రుబియో రంగంలోకి దిగి కాల్పుల విరమణ కోసం పాక్‌తో అత్యవసరంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

పాకిస్థాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ, పాలన మొత్తం రావల్పిండి నుంచే జరుగుతుంది. రావల్పిండిలోని చక్లాలా ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఈ కీలక ప్రాంతాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చక్లాలాలో పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీనితో పాటు గగనతల రిఫ్యూయలింగ్ ట్యాంకర్ ఫైటర్లు, హెవీ లిఫ్టర్లు అక్కడ ఉన్నాయి. భారత్ దాడిలో వాటికి తీవ్ర నష్టం వాటిల్లింది.

నూకాన్, సర్గోదా, రఫీ వంటి స్థావరాలపై భారత యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. భారత్ నిమిషాల వ్యవధిలో పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో ఆ దేశం తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాక్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్‌ను తీవ్రంగా దెబ్బతీసిన బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. 
BrahMos Missile
India-Pakistan Conflict
Operation Sundar
Pakistan Airbases
Military Strike
Super Sonic Cruise Missile
Ravalpindi
Anthony Blinken
Ballistic Missile
Nuclear War

More Telugu News