ఎల్‌వోసీ వద్ద నిశ్శబ్దం.. కాల్పుల విరమణకు పాక్ కట్టుబాటు
- నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల్లేవన్న భారత సైన్యం
- పహల్గామ్ దాడి తర్వాత 19 రోజులకు నిలిచిన ఘర్షణలు
- సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పుడే రావొద్దని సూచన
- పేలని షెల్స్ గుర్తించాకే అనుమతిస్తామన్న యంత్రాంగం
పహల్గామ్ ఉగ్రదాడి నుంచి పాకిస్థాన్ సైన్యం ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ దళాలు పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో భద్రతా దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కొన్ని రోజులుగా వారంతా తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
అయితే, సరిహద్దు గ్రామాల్లో పరిస్థితులు ఇప్పుడే పూర్తిగా చక్కబడలేదని, ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి తొందరపడొద్దని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా పేలని మోర్టార్ షెల్స్ ఉండే అవకాశం ఉందని, వాటిని గుర్తించి నిర్వీర్యం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో కూడా గత రాత్రి డ్రోన్ల సంచారం, కాల్పులు, లేదా బాంబు దాడులు వంటి ఘటనలేవీ నమోదు కాలేదని సమాచారం. అయినప్పటికీ, భద్రతా దళాలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి.