Amul: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ అమూల్ కార్టూన్ వైరల్!

Amuls Viral Cartoon Amidst India Pakistan Tension
  • ‘సెండ్ దెమ్ ప్యాకింగ్’ అంటూ అమూల్ దేశభక్తి యాడ్!
  •  అమూల్ నుంచి సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రత్యేక కార్టూన్
  • మహిళా అధికారులకు వందనం చేస్తున్న అమూల్ గర్ల్
భారతదేశం- పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇరు దేశాల మధ్య కాల్పులు, వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ విడుదల చేసిన ఒక ప్రత్యేక కార్టూన్ (టాపిక్) సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. దేశభక్తిని చాటుతూ, భారత సైనిక అధికారులకు వందనం చేస్తున్నట్లుగా ఉన్న ఈ కార్టూన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు నిర్వహించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

ఈ క్రమంలో, అమూల్ సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో, "#Amul Topical: The India-Pakistan conflict" (అమూల్ టాపిక్: భారత-పాకిస్థాన్ ఘర్షణ) అనే వ్యాఖ్యతో ఒక డూడుల్‌ను పంచుకుంది. ఈ డూడుల్‌లో "Send them pakking" (వారిని ప్యాక్ చేసి పంపండి) అని ఆసక్తికరంగా రాసి ఉంది. అలాగే "Amul proudly Indian" (అమూల్ గర్వించదగ్గ ఇండియన్) అనే నినాదం కూడా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో అమూల్ గర్ల్ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో కలిసి ప్రపంచానికి వివరించిన ఇద్దరు మహిళా అధికారులు.. ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, హెలికాప్టర్ పైలట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లకు వందనం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. పోడియంల ముందు నిలబడి ఉన్న ఈ మహిళా అధికారులకు అమూల్ గర్ల్ సెల్యూట్ చేస్తున్న దృశ్యం అనేకమంది భారతీయులను ఆకట్టుకుంది.

అమూల్ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ‘దీన్ని శాశ్వతం చేద్దాం’ అని ఒకరు వ్యాఖ్యానించగా, ‘చాలా బాగుంది’ అని మరొకరు ప్రశంసించారు. ‘అమూల్ బ్రాండ్ అంటే మాకు చాలా ఇష్టం’ అని ఇంకొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు సెల్యూట్ ఎమోజీలతో తమ స్పందనను తెలియజేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో అమూల్ విడుదల చేసిన ఈ కార్టూన్ భారతీయ పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని నింపడంతో పాటు, సాయుధ దళాల సేవలను స్మరించుకునేలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Amul
India-Pakistan Conflict
Viral Cartoon
Operation Sundar
Amul Girl
Colonel Sofia Khureshi
Wing Commander Vymika Singh
India Pakistan Tension
Patriotic Cartoon
Social Media Viral

More Telugu News