Marco Rubio: జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్‌లకు అమెరికా మంత్రి మార్కో రుబియో ఫోన్

US Senators Intervention in Crisis between India and Pakistan
  • జైశంకర్, రూబియో మధ్య టెలిఫోన్ సంభాషణ
  • తక్షణ ఉద్రిక్తతల నివారణకు అమెరికా పిలుపు
  • భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు యూఎస్ మద్దతు
  • పహల్గామ్ దాడిపై అమెరికా ప్రగాఢ సంతాపం
  • ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు సహకారం ఉంటుందన్న అమెరికా
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో అమెరికా మంత్రి మార్కో రూబియో టెలిఫోన్‌లో మాట్లాడారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు.

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా రూబియో నొక్కిచెప్పారని టామీ బ్రూస్ తన ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు నిరంతర ప్రయత్నాలను కొనసాగించాలని రూబియో ప్రోత్సహించినట్లు వివరించారు.

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి పట్ల రూబియో తమ ప్రగాఢ సంతాపం పునరుద్ఘాటించారని టామీ బ్రూస్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లు తెలియజేశారు.

మరోవైపు, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు పిలుపునిచ్చారు.

ఈరోజు సాయంత్రం పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్ము కశ్మీర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో భారత్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ విభాగం ప్రకటించింది.
Marco Rubio
S Jaishankar
Shehbaz Sharif
US-India Relations
India-Pakistan tensions
Pakistan Drone Attack

More Telugu News