Indian Stock Market: పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ డమాల్... మన మార్కెట్లు కూల్

Sensex Nifty Gains Despite Pakistan Stock Market Plunge
  • 105 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 34 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3,470 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్న పాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ కరాచీ-100
పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన దాడులు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. అయితే, ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేకపోయాయి. మన సూచీలు లాభాలతో ముగిశాయి.

భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవడం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్థాన్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయకపోవచ్చన్న అంచనాలు భారత మార్కెట్లకు ఊతమిచ్చాయి. దీనికి తోడు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, డాలర్ బలహీనపడటం, అమెరికా, చైనాలలో వృద్ధి మందగించడం, ముడిచమురు ధరలు తగ్గడం వంటి అంశాలు మన సూచీలు నిలదొక్కుకోవడానికి దోహదపడ్డాయి. 

ఆరంభంలో కొంత ఒడిదొడుకులకు లోనైనప్పటికీ, సెన్సెక్స్ 105 పాయింట్ల లాభంతో 80,746 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 24,414 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు క్షీణించి 84.81గా ఉంది. 

మరోవైపు, భారత దాడుల వార్తలతో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ కరాచీ-100 ఆరంభంలోనే సుమారు 6 శాతం కుప్పకూలి, 6,272 పాయింట్లు నష్టపోయింది. మన మార్కెట్లు ముగిసే సమయానికి, పాక్ స్టాక్ మార్కెట్ 3,470 పాయింట్ల (3.09%) నష్టంతో 1,10,063 వద్ద ట్రేడ్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి ప్రతిఘటన ఉంటుందన్న అంచనాలతో ఇప్పటికే పాక్ సూచీ నష్టాల్లో కొనసాగుతుండగా, తాజా దాడులు మరింత దెబ్బతీశాయి. 
Indian Stock Market
Pakistan Stock Market Crash
India-Pakistan Conflict
Operation Sindhura
Sensex
Nifty
US-China Growth Slowdown
Crude Oil Prices
Rupee-Dollar Exchange Rate
KSE-100 Index

More Telugu News