Shashi Tharoor: నేను గత వారం చెప్పినట్టుగానే పాక్ ను గట్టిగా, తెలివిగా దెబ్బకొట్టారు: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

Shashi Tharoor Praises Indias Strong Response to Cross Border Terrorism
  • పాక్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్
  • నా దేశాన్ని చూసి గర్వపడుతున్నానని థరూర్ ట్వీట్
  • భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్న కాంగ్రెస్ ఎంపీ
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ను ప్రతిపక్ష నాయకులు సైతం కొనియాడుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశి థరూర్... తాజాగా కేంద్ర ప్రభుత్వం, సాయుధ బలగాలను ప్రశంసిస్తూ తన స్పందనను 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "ఈ రోజు నా దేశాన్ని చూసి గర్వపడుతున్నాను. జై హింద్!" అని ఆయన ఒక పోస్టులో పేర్కొన్నారు. మరో పోస్టులో "ఉగ్ర లక్ష్యాలపై కచ్చితమైన, ప్రణాళికాబద్ధమైన, నిర్దిష్టమైన దాడులు జరిగాయి. గత వారం నేను చెప్పినట్లుగానే, గట్టిగా, తెలివిగా దెబ్బకొట్టారు. నేను భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మన సాయుధ బలగాలకు సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తాను" అని థరూర్ తెలిపారు.

"ఇదే సమయంలో, వివాదం మరింత విస్తరించకుండా ఉండేలా మనం వ్యవహరించాం. మన వాదనను స్పష్టం చేశాం. ఆత్మరక్షణ కోసం చర్య తీసుకున్నాం. అదుపులేని ఉద్రిక్తతలను నివారించడానికి సంబంధిత వర్గాలన్నీ వివేకంతో వ్యవహరించాల్సిన సమయం ఇది" అని థరూర్ పేర్కొన్నారు.
Shashi Tharoor
Operation Sindhu
India-Pakistan
Cross Border Terror
Surgical Strikes
Anti-Terror Operation
Indian Armed Forces
Congress MP
Pakistan
POK

More Telugu News