Vikram Misri: "ఆపరేషన్ సిందూర్": ఉమ్మడి మీడియా సమావేశంలో కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు

Pakistans Involvement in Pulwama Attack Terrorist Camps Destroyed
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'
  • పాక్ భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం
  • పక్కా నిఘా సమాచారంతో సైన్యం మెరుపుదాడులు
  • అజ్మల్ కసబ్‌తో పాటు డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన స్థావరాలు కూడా లక్ష్యంగా దాడులు
  • కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖల సంయుక్త ప్రకటన.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు "ఆపరేషన్ సిందూర్" పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ చర్య ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్నవారికి గట్టి హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో భారత పర్యాటకులపై లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు సహా మొత్తం 26 మంది మరణించారని మిశ్రీ గుర్తుచేశారు.

ముంబై 26/11 దాడుల తర్వాత పౌరులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించిన ఉగ్రదాడి ఇదేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను అతి సమీపం నుంచి వారి కుటుంబ సభ్యుల ముందే తలలపై కాల్చి అత్యంత పాశవికంగా హత్య చేశారని, ఈ దాడి జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగిందని తెలిపారు. గత ఏడాది 2.25 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని, పర్యాటకాన్ని దెబ్బతీసి, ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్ర ఇందులో ఉందని అన్నారు.

ఈ దాడికి "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" (టీఆర్ఎఫ్) అనే సంస్థ బాధ్యత తీసుకుందని, ఇది ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని మిశ్రీ తెలిపారు. టీఆర్ఎఫ్ గురించి, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు చిన్నచిన్న గ్రూపుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న తీరుపై భారత్ ఇప్పటికే ఐరాసకు ఆధారాలు సమర్పించిందని గుర్తుచేశారు. పహల్గామ్ దాడి ఘటనపై ఐరాస భద్రతా మండలి ఏప్రిల్ 25న విడుదల చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ ప్రస్తావనను తొలగించేందుకు పాకిస్థాన్ ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించారు. దాడి జరిగిన పక్షం రోజులు గడిచినా పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, పైగా ఆరోపణలను తిరస్కరిస్తూ వస్తోందని విమర్శించారు. భారత్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో, వాటిని నిరోధించేందుకే ఈ దాడులు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్" వివరాలు వెల్లడించిన సైనిక అధికారులు

కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, మే 6-7, 2025 అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్య "ఆపరేషన్ సిందూర్" నిర్వహించినట్లు తెలిపారు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేకూర్చేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. పాకిస్థాన్, పీఓజేకేలలో దశాబ్దాలుగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలు నిర్మించుకున్నారని, వీటిలో రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, శిక్షణా ప్రాంతాలు, లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయని వివరించారు. పక్కా నిఘా సమాచారంతో, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా అత్యంత జాగ్రత్తగా లక్ష్యాలను ఎంచుకున్నట్లు తెలిపారు.

ధ్వంసం చేసిన ఉగ్ర శిబిరాలు:

పీఓకేలో:
  • సవాయ్ నాలా: ముజఫరాబాద్, ఎల్‌ఓసీకి 30 కి.మీ. దూరం, లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం. సోన్‌మార్గ్, గుల్మార్గ్‌, పహల్గామ్ దాడుల ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ.
  • సయ్యద్నా బిలాల్ క్యాంప్: ముజఫరాబాద్, జైషే మహ్మద్ స్టేజింగ్ ఏరియా, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ.
  • గుల్‌పుర్ క్యాంప్: కోట్లి, ఎల్‌ఓసీకి 30 కి.మీ. దూరం, లష్కరే తోయిబా స్థావరం. పూంఛ్, తీర్థయాత్రికుల బస్సు దాడి ఘటనలకు ఇక్కడి నుంచే ప్రణాళిక.
  • బర్నాలా క్యాంప్: బింబర్, ఎల్‌ఓసీకి 9 కి.మీ. దూరం, ఆయుధాలు, ఐఈడీ, జంగిల్ సర్వైవల్ శిక్షణ.
  • అబ్బాస్ క్యాంప్: కోట్లి, ఎల్‌ఓసీకి 13 కి.మీ. దూరం, లష్కరే తోయిబా ఫિదాయీన్ శిక్షణ, సామర్థ్యం 15 మంది ఉగ్రవాదులు.

పాకిస్థాన్‌లో:
  • సజ్జల్ క్యాంప్: సియాల్‌కోట్, అంతర్జాతీయ సరిహద్దుకు 6 కి.మీ. దూరం. సాంబా కథువాలో పోలీసుల హత్యకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ఇక్కడే శిక్షణ.
  • మెహమూనా జాయా క్యాంప్: సియాల్‌కోట్, అంతర్జాతీయ సరిహద్దుకు 18-20 కి.మీ. దూరం, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంప్. పఠాన్‌కోట్ వైమానిక స్థావరం దాడికి ఇక్కడే ప్రణాళిక.
  • మర్కజ్ తోయిబా: మురిద్కే, అంతర్జాతీయ సరిహద్దుకు 18-25 కి.మీ. దూరం. 2008 ముంబై దాడుల ఉగ్రవాదులకు, అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్‌లీలకు ఇక్కడే శిక్షణ.
  • మర్కజ్ సుభాన్ అల్లా: బహవల్‌పూర్, అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. దూరం, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, రిక్రూట్‌మెంట్, శిక్షణ కేంద్రం.


వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, ఈ దాడుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను ఉపయోగించామని, లక్ష్యంలోని నిర్దిష్ట భవనాలను మాత్రమే ధ్వంసం చేశామని, తద్వారా సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడ్డామని తెలిపారు. ఎలాంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. భారత సాయుధ బలగాలు ఎంతో సంయమనం పాటించాయని, అయితే పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి దుస్సాహస చర్యలు జరిగినా వాటిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో దోషులు, సూత్రధారులు, నిధులు సమకూర్చినవారు, ప్రాయోజకులను బాధ్యులను చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా నొక్కిచెప్పిందని, భారత్ చేపట్టిన ఈ తాజా చర్యలను ఆ కోణంలోనే చూడాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. ఈ చర్య ఆచితూచి తీసుకున్నదని, ఉద్రిక్తతలను పెంచేది కాదని, దామాషా ప్రకారం, బాధ్యతాయుతంగా వ్యవహరించామని ఆయన తెలిపారు.
Vikram Misri
Operation Sindhu
Pakistan Terrorist Camps
Pulwama Attack
India Pakistan Conflict
Jammu and Kashmir Terrorism
Anti-Terrorism Operation
Colonel Sophia Khureshi
Wing Commander Vyomika Singh
Ajmal Kasab
David Headley

More Telugu News