US Support for India: ఉగ్రవాదంపై పోరాడండి.. మీ వెనక మేం ఉంటాం: భారత్ కు అమెరికా హామీ

US Assures India of Full Support in Fight Against Terrorism
  • వీలైనంత సాయం అందిస్తామని ప్రకటించిన అమెరికా స్పీకర్
  • భారత్ తమకు కీలక భాగస్వామి అని వెల్లడి
  • పహల్గామ్ దాడి తర్వాత అమెరికా నేతల సంఘీభావం
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ దేశం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. సోమవారం క్యాపిటల్ హిల్‌లో జరిగిన కాంగ్రెషనల్ బ్రీఫింగ్‌లో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా సతమతమవుతున్న భారత్‌కు ఏం సందేశం ఇస్తారన్న ప్రశ్నకు మైక్ జాన్సన్ స్పందిస్తూ.. "భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై మాకు పూర్తి సానుభూతి ఉంది. మిత్రదేశాలకు అండగా నిలవాలని మేము కోరుకుంటున్నాం. భారత్ మాకు చాలా ముఖ్యమైన భాగస్వామి. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను" అని తెలిపారు. "ఉగ్రవాదంపై పోరులో భారత్ కు అమెరికా చేయగలిగినదంతా చేస్తుంది" అని ఆయన అన్నారు.

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడు (ఏప్రిల్ 22) కూడా అమెరికా నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం అందిస్తామని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పూర్తి మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు తగ్గించుకొని, శాంతిని కాపాడేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాలని కూడా రూబియో సూచించినట్లు అప్పటి స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు.
US Support for India
India-US Relations
Terrorism
Mike Johnson
Counter-terrorism
Border Terrorism
Donald Trump
Marco Rubio
Narendra Modi
S Jaishankar

More Telugu News