Revanth Reddy: దొంగల్లా చూస్తున్నారు: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddys Sensational Remarks on Telanganas Financial Crisis
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న రేవంత్ రెడ్డి
  • ఢిల్లీకి వెళితే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్న సీఎం
  • బజారులో మనల్ని ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్య
  • ధరలు పెంచకుండా కొత్త కోరికలు నెరవేరవన్న సీఎం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనవాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళతారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదని, అందరూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకూ ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు.

"అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడిని. కానీ అప్పు పుట్టడం లేదు. ఎవరూ బజారులో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే మనల్ని బజారులో ఎవరైనా నమ్ముతారు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజారులో పడినట్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఉద్యోగ సంఘ నాయకులు దీనిని ఆలోచించాలి. ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం. పరువును బజారున పడేస్తామంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను"

ధరలు పెంచకుండా కొత్త కోరికలు నెరవేరవు

సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచితేనే పథకాలు అమలు చేయడానికి వీలవుతుందని అన్నారు. ధరలు పెంచకుండా, ఇప్పుడు ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేర్చడం కుదరదని ఉద్యోగ సంఘాల నాయకుల డిమాండును ఉద్దేశించి అన్నారు.

తనను కోసినా ఈ రాష్ట్రానికి రూ. 18,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం లేదని అన్నారు. ఖర్చులకు మాత్రం రూ. 22,500 కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పుడు ఏ పథకం ఆపాలో చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ సబ్సిడీని తీసేద్దామా లేక ఇంకేం చేద్దామని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా మరింత దివాళా రాష్ట్రంగా మారిపోతామని అన్నారు.
Revanth Reddy
Telangana Finance
Telangana Economy
State Debt
Government Employees
Welfare Schemes
Financial Crisis
Telangana Politics
Revanth Reddy Comments

More Telugu News