Kadambari Jathwani: నేడు ఏపీ సీఐడీ అధికారుల ముందు హాజరవనున్న ఆ ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు

Two Former AP Police Officials to Appear Before CID Today
  • నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలకు సీఐడీ నోటీసులు
  • నేడు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం
  • ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించిన సీఐడీ అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. నటి కాదంబరి జత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు దిగువ స్థాయి పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో వారు అరెస్టు నుంచి ఉపశమనం పొందారు. అయితే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

తాజాగా ఈ కేసులో విశాల్ గున్నీ, కాంతిరాణా తాతాలకు విచారణ నిమిత్తం హాజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగా, వారు ఈరోజు (సోమవారం) విజయవాడ సీఐడీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదివరకే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. 
Kadambari Jathwani
AP CID
Visakhapatnam Police
Former Police Officials
Vijayawada Jail
IPS Officers
Kantirana Tata
Vishal Gunni
PSR Anjaneyulu
Andhra Pradesh Politics

More Telugu News