NEET Exam 2025: ఏపీలో 72 ఏళ్ల అవ్వ.. తెలంగాణలో తల్లీకూతుళ్లు.. నీట్ పరీక్ష విశేషాలు

––
చదువుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు ప్రతిబంధకం కాబోదని కాకినాడకు చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు నిరూపించారు. నగరానికి చెందిన పోతుల వెంకటలక్ష్మి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష రాశారు. ఈ వయసులోనూ ఉత్సాహంగా పరీక్ష రాయడానికి వచ్చిన బామ్మను అందరూ ఆసక్తిగా తిలకించారు. ఉన్నత చదువులపై ఈ పెద్దావిడకున్న ఆసక్తి పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలంగాణలో మరో విశేషం చోటుచేసుకుంది. తన కూతురుతో పాటు ఓ మహిళ ఆదివారం జరిగిన నీట్ పరీక్ష రాశారు. అయితే, తల్లీకూతుళ్లు ఇద్దరూ వేర్వేరు జిల్లాల్లో పరీక్ష రాశారు.
సూర్యాపేట జిల్లాలోని మంచ్యానాయక్ తండాకు చెందిన భూక్యా సరిత(38) ప్రస్తుతం ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. వివాహం కారణంగా బీఎస్సీ నర్సింగ్ చివరి సంవత్సరంలో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరిత, భూక్యా కిషన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కావేరిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో నీట్ పరీక్షకు శిక్షణ ఇప్పించారు. ఆ సమయంలోనే తాను కూడా పరీక్ష రాయాలని సరిత నిర్ణయించుకుని కూతురుతో పాటు సిద్ధమయ్యారు. ఆదివారం తల్లి సరిత సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కుమార్తె కావేరి ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్ష రాశారు.