Anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు

Anvesh YouTuber Booked in Hyderabad for Spreading False Information
  • హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం పేరుతో రూ.300 కోట్లు స్వాహా చేశారని అధికారులపై ఆరోపణలు
  • డీజీపీ, మెట్రో ఎండీ, ఐఏఎస్‌లపై అవాస్తవ ప్రచారమని పోలీసుల ఆరోపణ
  • ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదు
  • సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సుమోటోగా కేసు నమోదు
ప్రపంచ యాత్రలు చేస్తూ, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేశారనే అభియోగంపై పోలీసులు సుమోటోగా ఈ కేసును స్వీకరించారు.

తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిశోర్, వికాస్‌రాజ్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో రూ.300 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ అన్వేష్ తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుడు సమాచారంతో కూడినవని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సదరు వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో ఉందని, ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా, వారి పరువుకు భంగం కలిగించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల విశ్వసనీయతను ప్రశ్నించేలా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేష భావాలను రెచ్చగొట్టేలా ఆ వీడియో ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అన్వేష్ ప్రపంచంలోని పలు దేశాలు పర్యటిస్తూ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం వంటి విశేషాలను తన వీడియోల ద్వారా వివరిస్తూ యూట్యూబ్‌లో గణనీయమైన ఆదరణ పొందాడు.
Anvesh
Cyber Crime
Hyderabad Police
Telangana DGP Jitender
False Information
YouTube
Content Creator
defamation
controversy
Metrorail

More Telugu News