Goa Temple Stampede: గోవా ఆలయ తొక్కిసలాట ఘటన.. అసలేం జరిగింది?

Tragedy Strikes Goa Stampede at Shirgaon Temple Leaves Several Dead
  • లైరాయి దేవి ఆలయ జాతరలో తీవ్ర తొక్కిసలాట
  •  ఆరుగురి మృతి.. 50 మందికిపైగా గాయాలు
  • వార్షిక ఉత్సవాల్లో భాగంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • విద్యుత్ షాక్ కారణంగానే ప్రమాదం జరిగిందన్న సీఎం  
గోవాలోని షిర్గావ్‌లో కొలువైన ప్రసిద్ధ లైరాయి దేవి ఆలయంలో ఈ తెల్లవారుజామున జరిగిన వార్షిక జాతర సందర్భంగా అపశ్రుతి దొర్లింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఊరేగింపులో ఒక్కసారిగా తొక్కిసలాట చెలరేగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 17 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో లైరాయి దేవి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. గోవా జానపద కథల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల దేవతల్లో ఒకరైన లైరాయి దేవిని పార్వతీదేవి అవతారంగా భక్తులు కొలుస్తారు. ఈ జాతరకు గోవా నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు. గత రాత్రి జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

తొక్కిసలాటకు కారణం ఇదే
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తెల్లవారుజామున 4 నుంచి 4:30 గంటల సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా అలజడి రేగింది. భయాందోళనలతో జనం పరుగులు తీయడంతో తీవ్రమైన తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఆలయంలో 'అగ్నిదివ్య' అనే ఆచారం ప్రకారం భక్తులు నిప్పుల గుండం చుట్టూ కూర్చొని మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు నిప్పులపై నడుస్తారు. అయితే, తొక్కిసలాట జరిగిన సమయంలో ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విపరీతమైన రద్దీ, నియంత్రణ లోపించడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఆకస్మిక విద్యుత్ షాక్ వల్ల భక్తులు భయాందోళనకు గురై ఉంటారని, అయితే తొక్కిసలాటకు కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గోవా మెడికల్ కాలేజీ, నార్త్ గోవా జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక యంత్రాంగం బాధితులకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడుతూ.. వైద్య అత్యవసర సేవల కోసం 24/7 హెల్ప్‌లైన్ నంబర్ 104ను ప్రారంభించినట్టు తెలిపారు. గోవా మెడికల్ కాలేజీతో పాటు ఇతర జిల్లా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్య ఏర్పాట్లు చేశామని, 10 అత్యాధునిక అంబులెన్సులను అందుబాటులో ఉంచామని వివరించారు.

 ఈ జాతర కోసం ఆలయ కమిటీతో సమన్వయం చేసుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారితో సహా వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందిని, వందలాది మంది కానిస్టేబుళ్లను, మహిళా పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించారు. గోవా రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 300 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు కూడా సేవలందించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఈ దురదృష్టకర సంఘటన జరగడం విచారకరం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Goa Temple Stampede
Shirgaon Lairai Devi Temple
Goa
India
Temple Tragedy
Religious Festival
Pramod Sawant
Narendra Modi
Vishwajit Rane
stampede
deaths
injuries

More Telugu News