Simhachalam Temple Wall Collapse: సింహాచలం దుర్ఘటన: విచారణలో వెలుగు చూస్తున్న కీలక అంశాలు ఇవే

- కమిటీ విచారణలో ఆలయ ఈవో, ఇంజినీరింగ్, టూరిజం కార్పొరేషన్ అధికారుల బాధ్యతారాహిత్యం వెలుగులోకి
- గోడ నిర్మాణానికి డిజైనలు, అనుమతులు లేని వైనం
- మూడు అంతస్తులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు లేని వైనం వెలుగులోకి
సింహాచలం ఆలయంలో చందనోత్సవం నాడు గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణ నిమిత్తం ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్, దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్ ఈ దుర్ఘటనకు బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కింది నుండి పైవరకూ సంబంధిత శాఖల అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు సమాచారం. తప్పును ఒకరిపై మరొకరు తోసుకుంటూ బాధ్యత లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నట్లు కమిటీ గుర్తించింది.
ప్రధానంగా మొదటి నుంచి ఇప్పటి వరకూ చేసిన ఏ పనికీ సరైన అనుమతులు లేవని విచారణలో వెల్లడైంది. తాత్కాలిక గోడ నిర్మాణం ఎందుకు చేపట్టారు? ఎవరు అనుమతి ఇచ్చారు? ఎవరు పర్యవేక్షించారు? అనే విషయాలకు స్పష్టమైన సమాధానం అధికారులు విచారణ అధికారుల ముందు చెప్పలేకపోయారు. అంతే కాకుండా మూడు అంతస్తులు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలోనూ ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు చేయడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనబడుతోంది.
ఇంకో విషయం ఏమిటంటే అక్కడ తాత్కాలిక గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజినీరింగ్ అధికారి ఎవరూ లేకపోవడం, ఆమోదం కూడా లేకపోవడంతో పునాదులు లేకుండానే కాంట్రాక్టర్ గోడ నిర్మించుకుంటూ వెళ్లారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వివిధ శాఖల అధికారులు దాటవేత ధోరణిలో చెప్పిన సమాధానాలు అన్నీ విచారణ కమిటీ నమోదు చేసింది. కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.