Khawaja Asif: అమెరికా కోసం 30 ఏళ్లు 'డర్టీ వర్క్' చేశామన్న పాకిస్థాన్... దీనిపై సమాధానం దాటవేసిన అమెరికా!

US Foreign Ministrys Response to Pakistans Accusations
  • పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
  • అమెరికా, బ్రిటన్ కోసం 30 ఏళ్లు చెత్త పనులు చేశామని వ్యాఖ్య
  • దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధిని ప్రశ్నించిన మీడియా
  • ఇండియా-పాక్ సరిహద్దుల్లో పరిణామాలను గమనిస్తున్నామన్న టామీ బ్రూస్
  • ఇంతకంటే ఎక్కువ సమాచారం తన వద్ద లేదని వ్యాఖ్య
పాకిస్థాన్ తమ దేశ ప్రయోజనాల కోసం కాకుండా, అమెరికా వంటి పశ్చిమ దేశాల కోసం గత మూడు దశాబ్దాలుగా 'చెత్త పనులు' చేసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై నేరుగా స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ విముఖత చూపింది, దౌత్యపరమైన సమాధానంతో సరిపెట్టింది.

పాక్ మంత్రి వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ నేరుగా బదులివ్వలేదు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో తమ విదేశాంగ మంత్రి సంప్రదింపులు జరుపుతారని ఆమె తెలిపారు. "ఆ ప్రాంత సరిహద్దుల్లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. వివిధ స్థాయుల్లో ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. అన్ని వర్గాలు కలిసి ఓ పరిష్కారం కనుగొనడాన్ని ప్రోత్సహిస్తాం. ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తోంది. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ సమాచారం నా వద్ద లేదు" అని బ్రూస్ పేర్కొన్నారు. 

ఇటీవల 'స్కై న్యూస్' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. "ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, వారికి శిక్షణ ఇవ్వడం వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోందన్న ఆరోపణలపై మీ స్పందన ఏంటి?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసిఫ్ బదులిచ్చారు. "గత మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మేం ఈ చెత్త పనులన్నీ చేశాం. అది మా పొరపాటు అని ఇప్పుడు అర్థమైంది. దాని వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం జోక్యం చేసుకోకుండా ఉంటే, పాక్‌కు గొప్ప పేరు ఉండేది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే ఇంటర్వ్యూలో, లష్కరే తోయిబా అనేది పాత పేరని, ప్రస్తుతం తమ దేశంలో దాని ఉనికి లేదని కూడా ఆసిఫ్ పేర్కొనడం గమనార్హం. పాక్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీయగా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ, వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. 
Khawaja Asif
Pakistan
US Relations
Dirty Work
America
Pakistan Defense Minister
US Foreign Policy
International Relations
Terrorism
Pakistan-US Relations

More Telugu News