Revanth Reddy: రేపే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు

Telangana 10th Class Results Tomorrow
  • మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల
  • మార్చి 21 - ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు
  • ఈసారి మార్కుల మెమోలో గ్రేడ్‌లతో పాటు సబ్జెక్టుల వారీగా మార్కులు
  • కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా గ్రేడ్‌లు కేటాయింపు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు (బుధవారం) విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడం, నూతన విధానంలో మార్కుల మెమోల జారీపై స్పష్టత రావడంతో ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మార్కుల మెమోలో మార్పులు

ఈ సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల మెమోల విధానంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది. గతంలో కేవలం సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏ మాత్రమే ఇచ్చేవారు. అయితే, ఇక నుంచి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను విడివిడిగా చూపించడంతో పాటు, మొత్తం మార్కులు, గ్రేడ్‌లను కూడా మెమోలో పొందుపరచనున్నారు. అలాగే, విద్యార్థి ఉత్తీర్ణత (పాస్/ఫెయిల్) వివరాలను కూడా స్పష్టంగా పేర్కొంటారు.

బోధనేతర కార్యక్రమాల్లో (కో-కరిక్యులర్ యాక్టివిటీస్) విద్యార్థుల ప్రతిభకు కూడా గ్రేడ్లు ఇవ్వనున్నారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వంటి నాలుగు విభాగాలకు సంబంధించిన గ్రేడ్లను కూడా మార్కుల మెమోలో ముద్రించనున్నట్లు అధికారులు తెలిపారు.
Revanth Reddy
Telangana 10th Class Results
TS 10th Results
Telangana Board Results
10th Class Results 2024
Telangana SSC Results
SSC Results
Grade Memo
Mark Memo
Telangana Education

More Telugu News