Arun Dhumal: 2028 నుంచి ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు ఉండనున్నాయా?

IPL 2028 Will the Tournament Expand to 94 Matches
  • ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచే ఆలోచనలో బీసీసీఐ
  • 2027 తర్వాత మీడియా హక్కుల కొత్త సైకిల్‌తో అమలు చేసే అవకాశం
  • ప్రతి జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళిక
  • ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడి
క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచే దిశగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్వరూపాన్ని విస్తరించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న 74 మ్యాచ్‌ల సంఖ్యను భవిష్యత్తులో 94కు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతానికి లీగ్‌లోకి కొత్త జట్లను తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందం 2027 సీజన్‌తో ముగియనుంది. 2028 నుంచి ప్రారంభమయ్యే తదుపరి మీడియా హక్కుల కాలానికి ముందు, మార్పులు తీసుకువచ్చే అంశంపై బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ల సంఖ్య పెంపు ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని, ఐసీసీతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

"ఫ్రాంఛైజీ క్రికెట్, టీ20 ఫార్మాట్, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ఈవెంట్‌ల పట్ల అభిమానుల ఆసక్తి ఎలా మారుతోంది అనే దానిపై మేం లోతుగా విశ్లేషిస్తున్నాం. ఈ అంశాలపై విస్తృత చర్చలు జరగాల్సి ఉంది" అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. టోర్నీని మరింత విస్తరించాలంటే మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 84కి లేదా 94కి పెంచాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒకవేళ 94 మ్యాచ్‌ల ఫార్మాట్‌ను అమలు చేయాలని నిర్ణయిస్తే, ప్రతి జట్టూ లీగ్‌లోని మిగిలిన అన్ని జట్లతో రెండేసి సార్లు తలపడే అవకాశం ఉంటుందని వివరించారు. ఒకటి సొంత మైదానంలో, మరొకటి ప్రత్యర్థి మైదానంలో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌తో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, సీడింగ్ ఆధారంగా సంక్లిష్టమైన షెడ్యూలింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే, ప్రతిపాదిత 94 మ్యాచ్‌ల విధానం అమల్లోకి వస్తే ప్రతి జట్టు అన్ని జట్లతో రెండేసి సార్లు ఆడే సరళమైన విధానం అందుబాటులోకి వస్తుంది.
Arun Dhumal
IPL 2028
IPL 94 Matches
BCCI
IPL Expansion
Indian Premier League
T20 Cricket
Cricket Matches
IPL Media Rights

More Telugu News