Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడిపై వ్యాఖ్యలు: కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే హెచ్చరిక

Kharges Warning to Congress Leaders Over Pulwama Comments
  • పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో తీవ్ర వివాదం
  • ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో అధిష్ఠానం ఆగ్రహం
  • పరిధి దాటొద్దంటూ నేతలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర హెచ్చరిక
  • దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడొద్దని ఆదేశాలు
  • కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ తీవ్ర విమర్శలు... పలు ప్రశ్నలు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రజల నుంచి, ఇతర పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావద్దని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

పార్టీ నేతలు ఎవరూ గీత దాటకూడదని ఖర్గే స్పష్టం చేశారు. పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా, దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు అధికారిక ఆదేశాలు కూడా జారీ చేశారు. పహల్గామ్ దాడిని దేశ ఐక్యత, సమగ్రతపై జరిగిన దాడిగా అభివర్ణించిన ఖర్గే, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు

పహల్గామ్‌లో ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి చంపి ఉండరంటూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ చెబుతున్నందున సింధూ జలాలను నిలిపివేయడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్‌ను కించపరిచేలా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పాకిస్థాన్ మీడియా ప్రముఖంగా ప్రసారం చేస్తోందని ఆయన ఆరోపించారు. శత్రు దేశం ముందు దేశ గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సొంత పార్టీ నేతల వ్యాఖ్యలను అదుపు చేయడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ విఫలమయ్యారా అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రదాడి ఘటనలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తుంటే, దేశంలోని కొందరు నేతలే వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. జాతీయ ఐక్యత గురించి కాంగ్రెస్ నేతలు చేసే ప్రసంగాలు కేవలం మాటలకే పరిమితమా అని నిలదీశారు.
Mallikarjun Kharge
Congress Party
Pulwama Attack
Terrorism
India
BJP
Raveeshankar Prasad
RB Thimmapur
Saifuddin Soz
Political Controversy

More Telugu News