Pakistanis: భార‌త్‌ను వీడిన 537 మంది పాకిస్థానీలు

509 Pakistanis Leave India After Deadline
  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాద దాడి త‌ర్వాత పాక్‌పై భార‌త్ క‌ఠిన ఆంక్ష‌లు
  • ఇండియా నుంచి పాక్ పౌరుల‌ను వెళ్ల‌గొడుతున్న వైనం
  • 27 లోపు పాకిస్థానీలంద‌రూ భార‌త్ నుంచి వెళ్లిపోవాల‌ని ఆదేశం
  • 4 రోజుల్లో అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా భార‌త్‌ను వీడిన 537 మంది పాకిస్థానీలు 
  • గ‌డువులోగా దేశం వీడ‌క‌పోతే మూడేళ్లు జైలు!
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత దాయాది పాకిస్థాన్‌పై భార‌త ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా భార‌త్‌లో ఉన్న ఆ దేశ పౌరుల‌ను దేశం విడిచిపెట్టి వెళ్లాల‌ని ఈ నెల 24వ తేదీన ఆదేశించింది. 27 వ‌ర‌కు పాకిస్థానీలంద‌రూ భార‌త్ నుంచి వెళ్లిపోవాల‌ని తెలిపింది. నిన్న‌టితో ఆ గ‌డువు ముగిసింది. 

అయితే, కేంద్రం ఆదేశాల త‌ర్వాత‌ నాలుగు రోజుల్లో అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్థానీలు స్వ‌దేశానికి వెళ్లారు. అలాగే పాక్ నుంచి 850 మంది భార‌తీయులు వ‌చ్చేశారు. ప‌న్నెండు ర‌కాల స్వ‌ల్ప‌కాల వీసాలు ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశం వీడాల‌ని భార‌త్ విధించిన గ‌డువు ఆదివారంతో ముగిసింది. ఇక‌, మెడిక‌ల్ వీసాలు క‌లిగిన వారికి రేప‌టి వ‌ర‌కు గ‌డువు ఉంది. 

గ‌డువులోగా దేశం వీడ‌క‌పోతే మూడేళ్లు జైలు!
భార‌త్‌లో ఉన్న పాకిస్థానీయులు చెప్పిన స‌మ‌యంలోగా దేశం వీడ‌క‌పోతే నేరుగా జైలుకు పంపుతామంటూ కేంద్రం హెచ్చ‌రించింది. ఏప్రిల్ 4న అమ‌లులోకి వ‌చ్చిన ఇమ్మిగ్రేష‌న్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్ర‌కారం... గడువు ముగిశాక భార‌త్‌లో ఉన్న పాక్ పౌరుల‌కు మూడేళ్ల జైలు/రూ. 3ల‌క్ష‌ల జ‌రిమానా లేదా రెండూ విధించే అవ‌కాశం ఉంది. 

ఇదిలాఉంటే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తీవ్ర వేదన వ్యక్తం చేశారు. నేరస్థులు, కుట్రదారులకు కఠినమైన శిక్ష ఉంటుంద‌ని ప్ర‌ధాని పునరుద్ఘాటించారు.  

ఇక‌, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పహల్గామ్ దాడి దర్యాప్తుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. బుధవారం నుంచి ఉగ్రవాద దాడి ప్రదేశంలో మకాం వేసిన ఎన్ఐఏ బృందాలు ఆధారాల కోసం అన్వేషణను ముమ్మరం చేశాయి. 
Pakistanis
India
Expulsion
Pakistan
Visa
Immigration Act
Attari-Wagah Border
Pulwama Attack
Narendra Modi
NIA

More Telugu News