Narendra Modi: ఇది రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను గౌరవించుకునే సభ: మంత్రి నాదెండ్ల

PM Modi to Honor Amaravati Farmers
  • మే 2న అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
  • రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ
  • రైతులను ప్రధాని చేతులు మీదుగా సత్కరిస్తామన్న మంత్రి నాదెండ్ల
  • ఇవాళ సభా వేదిక పరిశీలించిన వైనం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మే నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించి, నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులను ప్రధాని చేతుల మీదుగా సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులను గౌరవించుకునే సభ అని స్పష్టం చేశారు.

ఈ సభలో భాగంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో ముగ్గురిని వేదికపైకి ఆహ్వానించి ప్రధాని చేతుల మీదుగా గౌరవించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు చేసిన త్యాగాలను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన ఒక షార్ట్ ఫిలింను కూడా సభలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సీఆర్డీఏ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతిలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం అధికారులతో కలిసి సభాస్థలి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి... ప్రధాని సభకు అవసరమైన ఏర్పాట్లు, రోడ్ల అనుసంధానం, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు 5-6 జిల్లాల నుంచి సుమారు ఆరు లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని,  అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి వివరించారు.

సభా ప్రాంగణానికి ప్రజలు సులభంగా చేరుకునేందుకు వీలుగా మొత్తం 8 మార్గాలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. సభా నిర్వహణ రోజున ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తిగా వినియోగించుకుంటామని, అవసరమైతే వెస్ట్రన్ బైపాస్ రోడ్డును కూడా ఉపయోగించే యోచనలో ఉన్నామని అన్నారు. ఎల్లుండి (సోమవారం) ఎస్పీజీ సిబ్బంది వచ్చి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత, అవసరమైన మరిన్ని మార్పులు చేర్పులపై పునఃపరిశీలన చేస్తామని తెలిపారు.
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Farmers
Land Acquisition
Rajadhani
Modi Amaravati Visit
Amravati Development
Agriculture
Andhra Pradesh Politics

More Telugu News