Sadhvi Pragya Singh Thakur: మాలెగావ్ పేలుళ్ల కేసు.. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఉరిశిక్ష వేయాలని ఎన్ఐఏ విజ్ఞప్తి

NIA Seeks Death Penalty for Sadhvi Pragya Singh Thakur in Malegaon Blasts Case
  • 2008లో మహారాష్ట్రలోని మాలెగావ్‌లో రెండు వరుస బాంబు పేలుళ్లు
  • ఆరుగురి మృతి.. 100 మందికిపైగా గాయాలు
  • సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా 16 మంది నిందితులు
  • గతంలో వారికి క్లీన్ చిట్ ఇచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ
  • ఇప్పుడు వారికి ఉరిశిక్ష విధించాలని కోర్టుకు అభ్యర్థన
మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముంబైలోని ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలెగావ్‌లో రంజాన్ ప్రార్థన సందర్భంగా రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఆరుగురు మరణించగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారించింది. ఈ సందర్భంగా ప్రజ్ఞా ఠాకూర్‌, శివనారాయణ్‌ గోపాల్‌ సింగ్‌ కల్సంఘ్రా, శ్యామ్‌ భవర్లాల్‌ సాహును అరెస్టు చేసింది. వీరితోపాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎంకోకా (మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ యాక్ట్‌) కింద అభియోగాలు నమోదు చేసింది. దీంతో వారికి బెయిల్‌ లభించలేదు.

2011లో ఈ కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా మరికొందరికి ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ పురోహిత్‌ సహా మరో 10 మందిపై ఎంకోకా చట్టం కింద దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ రద్దు చేసింది. అయితే, ప్రజ్ఞాసింగ్ మాత్రం విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

17 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఈ కేసు విచారణ ఈ నెల 19న ముగిసింది. ఈ కేసులో నిందితులకు గతంలో క్లీన్‌చిట్ ఇచ్చిన ఎన్ఐఏ ఆ తర్వాత అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. 2015లో సాక్షులు మాట మార్చారని, కాబట్టి వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేమన్న ఎన్ఐఏ.. ప్రజ్ఞాసింగ్‌, ప్రసాద్‌ పురోహిత్‌, సుధాకర్‌ ద్వివేది, రిటైర్డ్‌ మేజర్‌ రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్కర్‌, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని సెక్షన్‌ 16 కింద మరణశిక్ష విధించాలని ముంబైలోని ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది. వాదనల అనంతరం తీర్పును వచ్చే నెల 8కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Sadhvi Pragya Singh Thakur
Malegaon Blasts
NIA
Death Penalty
Mumbai Court
Terrorism
India
Maharashtra
2008 Malegaon Bombings
Lieutenant Colonel Purohit

More Telugu News