Butta Renuka: రుణం చెల్లించని కేసు.. వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం!

Rs 310 Crore Loan Default Butta Renukas Assets on Auction Block
  • 2018లో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 310 కోట్ల రుణం
  • ఐదేళ్ల క్రితం నుంచి వాయిదాల చెల్లింపులు బంద్
  • రుణం రీషెడ్యూల్‌కు నిరాకరించిన హెచ్ఎఫ్ఎల్
  • హైదరాబాద్‌లోని బుట్టా ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభం
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 310 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిసి 2018లో 15 ఏళ్ల కాలానికి గాను రూ. 310 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు వినియోగించారు.

ఐదేళ్ల క్రితం వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం రూ. 40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అయితే, ఆ తర్వాతి నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా దాదాపు రూ. 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే, వడ్డీ భారం ఎక్కువగా ఉండటంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీ షెడ్యూల్ చేయాలని వారు కోరారు.

అయితే, ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో హెచ్ఎఫ్ఎల్ దీనిని అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూ. 3.4 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ మొత్తం భారంగా మారడంతో తొలుత తక్కువ మొత్తం తీసుకుని, చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. దీనికి కూడా హెచ్ఎఫ్ఎల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాయిదాల చెల్లింపు నిలిచిపోవడంతో ఎన్‌సీఎల్‌టీని హెచ్ఎఫ్ఎల్ ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. 

రుణ నిబంధనలకు అనుగుణంగా ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని 5 వేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ వేలానికి కూడా స్పందన రాలేదు. దీంతో అధికారులు మరోమారు వేలానికి ప్రయత్నిస్తున్నారు. 
Butta Renuka
YCP MP
Loan Default
HFCL Loan
Asset Auction
Hyderabad
Banjara Hills
Madhapur
NCLT
LIC

More Telugu News