Chandrababu Naidu: మీరు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidus 75th Birthday Gratitude and Future Vision
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • 75వ జన్మదినం వేళ శుభాకాంక్షల వెల్లువ
  • ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
  • తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని ప్రకటన
  • ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలని పునరుద్ఘాటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయిలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు సైతం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. 

ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగిందని పేర్కొన్నారు. తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని తన పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సంకల్పం ప్రకటించారు. ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలన్నది తన అభిమతమని పునరుద్ఘాటించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు. 

"నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 

75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశం. 

మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నాను. 

స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం. మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తాను. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తాను. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు , అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది నా తపన. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందాం .

సమాజంలో అసమానతలు పోవాలి. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం... మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో మార్పుతెచ్చింది. ఈసారి తీసుకువచ్చిన ‘పీ4’తో రాష్ట్రంలో పేద కుటుంబాలను... స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది నా ప్రయత్నం. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి. వ్యక్తి శ్రేయస్సే... సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తాను. జనం మన బలం... జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయి. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నాం. మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలం. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదాం. నాతో పాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నాను.

నా పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ, విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు....అందరికీ మరోసారి ధన్యవాదాలు" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
Chandrababu Naidu
75th Birthday
Andhra Pradesh CM
Telugu Desam Party
TDP
Indian Politics
Telugu People
AP Development
Swarnandhra Vision 2047
P4 Programme

More Telugu News