Mummidi Varuppu Joshibanu: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం.. బస్సు కింద పడి కార్పెంటర్ మృతి

Carpenter Dies After Trying to Evade Hyderabad Traffic Police
  • హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైక్‌ను ఒక్కసారిగా వెనక్కి తిప్పిన జోషిబాను
  • వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొని రోడ్డుపై పడిన బాను పైనుంచి దూసుకెళ్లిన బస్సు
  • ట్రాఫిక్ పోలీసులతో వాహనదారుల వాగ్వివాదం
  • బైక్‌ను ఆపిన పోలీస్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ కార్పెంటర్ బస్సు కింద పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ టౌన్‌షిప్ గేటు వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ-అంబేద్కర్ జిల్లా గేదెల లంకవరానికి చెందిన ముమ్మిడివరపు జోషిబాను (32) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి గాజుల రామారం-రుడామేస్త్రీ నగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పంజాగుట్టలో పని ఉండటంతో నిన్న మధ్యాహ్నం బైక్‌పై జోషిబాను బయలుదేరాడు. ఐడీపీఎల్ టౌన్‌షిప్ గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపడంతో ఆపినట్టే ఆపి బైక్‌ను కుడివైపునకు తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వెనుక వస్తున్న బైక్ ఢీకొనడంతో రోడ్డు మధ్యలో పడిపోయాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక టైరు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ స్థానికులు, వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 

మృతుడు జోషిబాను సోదరుడు నాగఫణీంద్ర ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ పోలీసుపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ మద్యం సేవించాడా? అన్నది తెలుసుకునేందుకు గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు తరలించినట్టు తెలిసింది. 
Mummidi Varuppu Joshibanu
Hyderabad Traffic Police
Road Accident
Balnagar Police Station
Carpenter Death
IDPL Township
Traffic Police Brutality
Andhra Pradesh
Konaseema District
RTCS Bus

More Telugu News