Nara Lokesh: ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు మంత్రి లోకేశ్‌ శ్రీకారం

Minister Nara Lokesh Inaugurates Reliances CBG Plant in Prakasam District
  • ప్రకాశం జిల్లా దివాకరపల్లి వద్ద రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన
  • రిలయన్స్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి 
  • రాష్ట్రంలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్
  • 2.50 లక్షల మందికి ఉపాధి
ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు. 

దివాకరపల్లి వద్ద 475 ఎకరాల్లో రూ.139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలి ప్లాంటుకు బుధవారం మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో రూ. 65వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లను స్థాపించనుంది. తద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ దేశంలో 4 సీబీజీ హబ్‌ల‌ను ఏర్పాటు చేయనుండగా అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ప్లాంట్ ఆవరణలోకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ కు కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, సీఎస్ కె.విజయానంద్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్. అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, దర్శి ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే ఎన్. పాపారావు, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Prakasam District
Reliance Industries
CBG Plant
Andhra Pradesh
Industrial Development
Biogas Plant
Investment
Job Creation
Divakarapalli

More Telugu News