Ambati Rayudu: వరుసగా ఓడిపోతున్న ముంబయి ఇండియన్స్ కు అంబటి రాయుడు కీలక సూచన

Ambati Rayudus Crucial Advice to Struggling Mumbai Indians
  • ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబై ఇండయన్స్ ఓటమి
  • నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్
  • బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు సూచించిన రాయుడు
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై ఇంకా బోణీ కొట్టకపోవడంతో, జట్టులో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డాడు. ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం రాయుడు కొన్ని వ్యూహాలను సూచించాడు.

ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని స్పష్టం చేశాడు. "నమన్ ధీర్‌ను మూడో స్థానంలో ఆడించాలి. అలాగే హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలి. ఇలా చేస్తే ముంబై బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుంది" అని రాయుడు పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ... "ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా ఉంది. అయితే, సరైన ఆటగాళ్లను ఏ స్థానంలో ఆడిస్తే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందో యాజమాన్యం దృష్టి సారించాలి" అని అన్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించి హార్దిక్ పాండ్యా తన సత్తా చాటాడని, అతను కెప్టెన్‌గా నిరూపించుకున్నాడని రాయుడు గుర్తు చేశాడు. "హార్దిక్ మానసికంగా బలంగా ఉన్నాడు. అతను ముంబై జట్టును ముందుకు నడిపిస్తాడు" అని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ముంబై గెలుపు సునాయాసమవుతుందని రాయుడు పేర్కొన్నాడు.

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తాజా సీజన్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడగా, రెండింట్లోనూ ఓడిపోయింది. ఇవాళ ఆ జట్టు సొంతగడ్డపై కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడుతోంది. 
Ambati Rayudu
Mumbai Indians
IPL 2025
Hardik Pandya
Naman Dhir
Kolkata Knight Riders
Cricket
T20
BCCI
Mumbai Indians Strategy

More Telugu News