Yugal Yadav: క్షుద్రపూజల కోసం వృద్ధుడి తలనరికి... మొండాన్ని‘హోలికా దహన్’లో కాల్చేసిన వైనం!

Horrific Human Sacrifice in Bihar Mans Head Severed Body Burned in Holika Dahan
  • బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఘటన
  • ఓ వ్యక్తికి సంతానం కోసం క్షుద్రపూజలు
  • వృద్ధుడిని కిడ్నాప్ చేసి తల నరికి దారుణం
  • గతంలోనూ ఓ టీనేజర్‌ను బలిచ్చిన తాంత్రికుడు
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. క్షుద్రపూజల కోసం 65 ఏళ్ల వృద్ధుడిని చంపిన కొందరు వ్యక్తులు ఆపై తలను వేరు చేసి మొండాన్ని మంటల్లో వేసి కాల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. తాంత్రికుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధిత వృద్ధుడిని గులాబ్ బిఘా గ్రామానికి చెందిన యుగల్ యాదవ్‌గా గుర్తించారు. మార్చి 13న మదన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. 

ఈ క్రమంలో పొరుగున ఉన్న బంగార్ గ్రామంలో ‘హోలికా దహన్’ (హోలీ దహనం) బూడిదలో కొన్ని మానవ ఎముకలను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా యాదవ్‌కు చెందిన కాలిపోయిన ఎముకలు, చెప్పులు లభించాయి. దీంతో వెంటనే ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. శునకాలు నేరుగా రామశిష్ రిక్యాసన్ అనే తాంత్రికుడి ఇంటికి తీసుకెళ్లాయి. అతడు ఇంట్లో లేకపోవడంతో ఆయన బంధువు ధర్మేంద్రను పోలీసులు ప్రశ్నించారు. తాంత్రికుడి గురించి పొంతనలేని సమాధానాలు ఇస్తుండటంతో ధర్మేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను మరికొందరితో కలిసి యుగల్ యాదవ్‌ను కిడ్నాప్ చేసినట్టు ధర్మేంద్ర అంగీకరించాడు. క్షుద్రపూజల కోసం అతడి తల నరికినట్టు చెప్పాడు. అనంతరం మొండాన్ని ‘హోలికా దహన్ అగ్ని’లో వేసినట్టు వివరించాడు. అతడిచ్చిన సమాచారంతో సమీపంలోని పొలాల్లో యుగల్ యాదవ్ తలను స్వాధీనం చేసుకున్నారు. 

సంతానం కోసం ప్రయత్నిస్తున్న సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి కోసం తాంత్రికుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. గతంలో ఓ టీనేజర్‌ను కూడా బలిచ్చినట్టు నిందితుడు ధర్మేంద్ర పోలీసులకు తెలిపాడు. పాశ్వాన్, ధర్మేంద్రతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ బాలుడిని కూడా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.  
Yugal Yadav
Bihar
Aurangabad
Black Magic
Human Sacrifice
Holika Dahan
Ramashish Rikyasn
Sudhir Pashwan
Dharmendra
Murder

More Telugu News