వచ్చే ఖరీఫ్ నాటికి మరింత సమర్థవంతంగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Minister Nadeendla Manohar on Efficient Paddy Procurement
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ 227వ బోర్డు సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్‌లో 5,61,216 మంది రైతుల నుంచి 35,48,724 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, దీనికి గాను రూ.8,138 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి ధాన్యం కొనుగోలును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఆర్ఎస్కేలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచి రబీ కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న దీపం-2 పథకం గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. మొదటి ఉచిత సిలిండర్ పొందేందుకు 2025 మార్చి 31 వరకు గడువు ఉందని, ఇప్పటివరకు 98 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు. 

ఈ సిలిండర్లను నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చని, పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్ డెలివరీ చేయబడుతుందని తెలిపారు. డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన మొత్తం లబ్ధిదారుల ఖాతాలో తిరిగి జమ చేయబడుతుంది. ఈ పథకానికి సంబంధించిన సమస్యలు లేదా సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేయాలని సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, భద్రతను మెరుగుపరిచేందుకు ప్రైవేటు గోడౌన్ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా గోడౌన్లలోని సరుకు నిల్వలను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, ప్రతి గోడౌన్ పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కోసం హాస్టల్స్‌కు 1.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. తృణధాన్యాల వినియోగం పెంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, త్వరలో చౌక ధరల దుకాణాల ద్వారా రాగులు, కొర్రలు, సజ్జలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని, తృణధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎండీ మంజీర్ జిలాని, కమిషనర్ సౌరబ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్ సభ్యులు బోడపాటి శ్రీధర్, కడాలి ఈశ్వరి, పద్మజ, ఆనంద్, కోటి, పట్టాభి, తోట పార్థసారథి, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Go Back to Shorts
Nadeendla Manohar
Andhra Pradesh
Paddy Procurement
Civil Supplies Corporation
Deepa-2 Scheme
Agriculture
Food Security
Rabi Procurement
Artificial Intelligence
Green Energy

More Telugu News