Konda Surekha: రేవంత్ రెడ్డికి స్టీల్ క్యారియర్ అందించిన కొండా సురేఖ

Minister Konda Surekha Gifts Steel Tiffin Box to Telangana CM Revanth Reddy
  • ప్రజాప్రతినిధులకు జూట్ బ్యాగు, కాపర్ బాటిల్, స్టీల్ క్యారియర్ అందజేత
  • ఎవరూ ప్లాస్టిక్ వాడవద్దని విజ్ఞప్తి
  • ప్లాస్టిక్ వ్యర్థాలతో అంతా కలుషితమవుతోందని ఆందోళన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ స్టీల్ క్యారియర్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'సే నో టు ప్లాస్టిక్' అనే నినాదంతో తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆమె జూట్ బ్యాగు, పుస్తకం, కాపర్ బాటిల్, స్టీల్ క్యారియర్, బట్ట సంచులను పంపిణీ చేశారు.

తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడవద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'ప్లాస్టిక్ వినియోగం - ప్రమాద ఘంటికలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీ రవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారని, వాటిని పడేస్తున్నారని అన్నారు. ప్రతి నిమిషం 10 లక్షల వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 630 కోట్ల టన్నులు అని అన్నారు. ఇందులో 79 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాలు, నీటి వనరులలో పారేస్తున్నారని తెలిపారు.

12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిపై వదిలేస్తున్నారని, 9 శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతోందని వివరించారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్వలు, సరస్సులు, నదీ ప్రవాహాలను అడ్డుకుంటున్నాయని అన్నారు. ఇవి మొక్కలు, వృక్షాలు, జంతు జలాన్ని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వలన క్యాన్సర్ కారక విషపూరిత వాయువులు వెలువడుతున్నాయని పేర్కొన్నారు.
Konda Surekha
Revanth Reddy
Telangana
Plastic Pollution

More Telugu News