Pawan Kalyan: మరో 15 ఏళ్లు చంద్రబాబే సీఎం... ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే: పవన్ కల్యాణ్

Pawan Kalyan Wants Chandrababu Naidu as CM for 15 More Years
  • విజయవాడలో ఎమ్మెల్యేల క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం
  • సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన పవన్ కల్యాణ్
  • అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం
  • చంద్రబాబు అనుభవాన్ని పక్కన పెట్టలేమని స్పష్టీకరణ
రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్... క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన శాసనసభ్యులను, సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు. 

మోషన్ రాజు, రఘురామకృష్ణ రాజులకు, కమిటీ సభ్యులకు, క్రీడా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.

పార్టీలకు అతీతంగా, సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. క్రీడా మైదానంలో ఏర్పాట్లు, క్రీడా సామాగ్రి, క్రీడాకారుల సౌకర్యాల కోసం వారు చేసిన కృషి అభినందనీయమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకుని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కనీసం 15 ఏళ్లు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పక్కన పెట్టలేమని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మంచి అనుభవాలను తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh
Politics
Deputy CM
Telugu Desam Party
Sports
MLA
Vijayawada

More Telugu News