Ranya Rao: నటి రన్యా రావు కేసులో కీలక పరిణామం... సవతి తండ్రిని సెలవుపై పంపిన ప్రభుత్వం

Karnataka govt sent Ranya Rao step father Ramachandra Rao on compulsory leave
  • బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు
  • అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు
  • 14.8 కేజీల బంగారం సీజ్
నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రన్యా రావు సవతి తండ్రి, కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి కె. రామచంద్రరావును ప్రభుత్వం సెలవుపై పంపింది. రామచంద్రరావు కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయనను సెలవుపై పంపడానికి గల కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఆయన డీజీపీ హోదాలో ఉన్నందున ఈ కేసును ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్న కారణంతోనే తప్పనిసరి సెలవుపై పంపినట్టు తెలుస్తోంది.

ఈ నెల మొదట్లో  రన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. ఆమె వద్ద 14.8 కిలోల బంగారం లభ్యమైంది. రన్యా రావు అరెస్టు సమయంలో రామచంద్రరావు స్పందిస్తూ, ఈ విషయం మీడియా ద్వారా తనకు తెలిసిందని,  తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనకు ఇతర విషయాలేవీ తెలియవని, తాను దీనిపై ఏమీ మాట్లాడదలచుకోలేదని ఆయన అన్నారు. రన్యా రావు తమతో కాకుండా,  భర్తతో వేరుగా నివసిస్తోందని, వారి మధ్య కుటుంబ సమస్యలు ఉండవచ్చని ఆయన తెలిపారు. 

కాగా, విచారణలో రన్యా రావు తనకున్న పరిచయాలతో గతంలో భద్రతా తనిఖీలను తప్పించుకుందని తేలింది. తాను కర్ణాటక డీజీపీ కుమార్తెనని చెప్పి, పోలీసుల ఎస్కార్ట్ కోరినట్లు సమాచారం. ఆమె గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు. 

దుబాయ్ నుంచి వచ్చిన రన్యా రావు వద్ద రూ. 12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. ఆమె తన దుస్తులలో బంగారాన్ని దాచి, కొంత బంగారాన్ని ధరించి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. 

ఆమె భర్తతో కలిసి ఉంటున్న ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, రూ. 2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం అక్రమ రవాణా కేసును డీఆర్‌ఐ, సీబీఐ, ఈడీ విభాగాలు విచారిస్తున్నాయి. రన్యా రావు కేసును డీఆర్‌ఐ విచారిస్తుండగా, సీబీఐ ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను, దాని నిర్వాహకులను విచారిస్తోంది. హవాలా మార్గాలను ఈడీ విచారిస్తోంది.
Ranya Rao
Ramachandra Rao
Gold Smuggling
Karnataka

More Telugu News