Nitin Gadkari: ఆ మాట మాత్రం అడగొద్దు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari asks industry to stop demanding GST cuts
  • పన్నులు తగ్గించాలని కోరవద్దని పరిశ్రమ వర్గాలకు గడ్కరీ సూచన
  • పన్నులు తగ్గిస్తే, ఇంకా తగ్గించమని అడుగుతారని వ్యాఖ్య
  • పన్నులు తగ్గిస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బంది అవుతుందన్న గడ్కరీ
ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి పేదల అవసరాలకు వినియోగించడమే ప్రభుత్వం దార్శనికత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన పరిశ్రమ వర్గాలకు సూచించారు. అలా తగ్గిస్తే మరింత తగ్గించమని కోరతారని, ఇది మనుషుల తత్వమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పన్నులు తగ్గించాలని కోరవద్దని ఆయన అన్నారు.

పేదల సంక్షేమం కోసం పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని వ్యాఖ్యానించారు. పన్నులు తగ్గించాలని తాము ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని తెలిపారు. పన్నులు తగ్గిస్తే సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు రెండేళ్లలో తొమ్మిది శాతానికి తగ్గుతుందని పరిశ్రమ వర్గాలకు మంత్రి హామీ ఇచ్చారు.

లాజిస్టిక్స్ ఖర్చు చైనాలో 8 శాతం కాగా, అమెరికా, ఐరోపా దేశాల్లో 12 శాతంగా ఉందని తెలిపారు. మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సి ఉందని ఆయన అన్నారు.
Nitin Gadkari
BJP
Income Tax
GST

More Telugu News