RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్

rk roja sensational comments on cm chandrababu and deputy cm pawan kalyan
  • కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదన్న ఆర్కే రోజా
  • నవ మాసాల్లో కూటమి సర్కార్ నవ మోసాలను తెచ్చిందన్న విమర్శ
  • మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారని ఫైర్
తొమ్మిది నెలల్లో మహిళలకు నవ మోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే పథకాల అమలులో వారికి మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారతను అందుకున్నారని అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేని స్థితిలో ఉన్నారని రోజా అన్నారు. వైయస్ జగన్ పాలనలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు నిలదొక్కుకునే విధంగా వ్యవహరించారన్నారు. రాజకీయంగా యాభై శాతం నామినేటెడ్ పోస్టులు మహిళలకు కల్పించి, జగన్ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఈ రోజు కూటమి పాలనలో మహిళలు భయం... భయంగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితకు మహిళలంటే గౌరవం, అభిమానం లేదని విమర్శించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రన్న పగ, చంద్రన్న దగా, చంద్రన్న మోసం, తల్లికి పంగనామం, నిరుద్యోగులకు వెన్నుపోటులతో పాలనను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు, ముంచే ప్రభుత్వమని చెబుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ ఒక మహిళా ద్రోహి అని విమర్శించారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన వ్యవహారశైలి చూస్తే ఆయనెవరో అందరికీ అర్థమవుతోందన్నారు. సుగాలి ప్రీతి తల్లి జనసేన సభ్యత్వం తీసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఆమెకు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రోజా ప్రశ్నించారు. ఆనాడు మీరు డిమాండ్ చేసినట్లు ఎందుకు సీబీఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని రోజా నిలదీశారు. 
RK Roja
YSRCP
Tadepalli
Chandrababu
Pawan Kalyan
AP Politics

More Telugu News