Nadendla Manohar: మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ సేవలు వినియోగించుకోవాలి: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar says women should use 181 toll free number while emergency
  • నేడు మహిళా దినోత్సవం
  • ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజిలో మహిళా దినోత్సవ వేడుకలు
  • హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరులో సీఆర్ఆర్ కాలేజిలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు ఏపీ పౌర సరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. 

మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు.... మీ వెంటే మేముంటాం అంటూ మంత్రి భరోసా ఇచ్చారు. 

"వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు దీపం-2 పధకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం. ఇప్పటికే 96.40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తిగా మద్దత్తిస్తాం. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు మహిళలలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం" అని నాదెండ్ల వివరించారు. 

కాగా, ఈ కార్యక్రమంలో తొలుత రూ.131.82 కోట్ల చెక్కును మంత్రి డ్వాక్రా సంఘాల మహిళలకు అందజేశారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nadendla Manohar
Women's Day
CRR College
Eluru

More Telugu News