మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో లైన్ పనులు.. నేటి నుంచి పలు రైళ్ల రద్దు

South Central Railway Cancels Several Trains
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. గుంటూరు, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి సహకరించాలని కోరారు. 

దారి మళ్లించిన రైళ్లలో విశాఖ-న్యూఢిల్లీ, విశాఖ-గాంధీధామ్, హైదరాబాద్-షాలీమార్, ముంబై-భువనేశ్వర్, షిర్డీ-కాకినాడ, షిర్డీ-మచిలీపట్నం, ఎర్నాకుళం-బరౌనీ రైళ్లు ఉన్నాయి. అలాగే, రద్దయిన రైళ్లలో డోర్నకల్-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ఇండోర్-కొచ్చివెల్లి, కోర్బా-తిరువనంతపురం, గోరఖ్‌పూర్-కొచ్చివెల్లి, హిస్సార్-తిరుపతి రైళ్లు ఉన్నాయి. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైళ్లను రేపటి నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేశారు.

గమనిక: రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లించిన వాటిలో తిరుగు ప్రయాణ రైళ్లు కూడా ఉన్నాయి. అత్యవసర సమాచారం కోసం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో సంప్రదించవచ్చు.
Go Back to Shorts
South Central Railway
Khammam Division
Mahabubabad District

More Telugu News