బాబు సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో పెద్దపీట
- తల్లికి వందనం స్కీమ్ కు రూ.9,407 కోట్లు
- తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటిన వార్షిక బడ్జెట్
- మత్స్యకారులకు రూ.20 వేల సాయం.. దీపం పథకం కింద నిధుల కేటాయింపు
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. ప్రతీ కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు రూ.25 లక్షల బీమా సదుపాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. మరమగ్గాలపై ఆధారపడే చేనేత కుటుంబాలకు 500 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు దీపం 2.0 పథకం కింద నిధుల కేటాయింపు జరిపామని మంత్రి పయ్యావుల కేశవ్ సభలో పేర్కొన్నారు.